భీంపూర్, మే26: మండలంలోని 26 పంచాయతీల్లో ఉపాధిహామీ ద్వారా నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నారు. ఒక్కో నర్సరీలో పంచాయతీ అవసరాలకు అనుగుణంగా 10 వేల నుంచి 20 వేల వరకు మొక్కలు పెంచుతున్నారు. ఇలా మొత్తంగా 3 లక్షల వరకు వివిధ జాతుల పూలు, పండ్ల జాతి సహ వెదురు ,టేకు లాంటి మొక్కలు కూడా పెంచుతున్నారు.
ఈ నర్సరీల్లో ప్రతి మొక్క కూనీరందించడం,సంరక్షించడం కోసం వాచర్లను నియమించారు. అలాగే మొక్కల్లో కలుపు నివారణ చేయడం , అవసరమైన సేంద్రియ ఎరువులు వేయడానికి ఈజీఎస్ ద్వారా కూలీలకు వేతనాలు ఇస్తున్నారు. నర్సరీ ఒక వేళ చేనులో ఉంటే ఆ రైతుకు కూడా కొంత మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఈ నర్సరీలను రోజూ సంబంధిత సర్పంచ్లు ,కార్యదర్శులు ,ఈజీఎస్ టీఏలు పర్యవేక్షిస్తున్నారు. ఇక అప్పుడప్పుడు మండల ,జిల్లా అధికారులు తనిఖీలు చేస్తూ సంరక్షణ తీరు తెన్నులను తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం స్థానికంగానే నర్సరీలు ఏర్పాటు చేయడంతో హరితహారం కార్యక్రమానికి ఇతర ప్రాంతాలనుంచి మొక్కలను తరలించే వ్యయప్రయాసలు ఇప్పుడు లేవని సర్పంచులు హర్షంవ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ఒక నర్సరీ ఏర్పాటు చేసి మొక్కల పెంపకం చేపట్టటంతో ఇపుడు హరితహారంలో మొక్కలకు కొదువ లేదు . గ్రామాలలో ప్రతి ఇంటి ఆవరణలో ,చేలగట్లపై నాటటానికి మొక్కలు చెంతనే అందుబాటులో ఉన్నాయి. మా పంచాయతీలో ప్రతి మొక్కను సంరక్షిస్తున్నాము .
– తాటిపెల్లి లావణ్య , సర్పంచ్ ,కామట్వాడ ,భీంపూర్ మండలం
మండలంలోని ప్రతి నర్సరీ కనువిందు చేస్తున్నది. సర్పంచ్లు, కార్యదర్శులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. మేము కూడా వారానికి ఒకసారి సందర్శిస్తున్నాం. ఎంపీడీవో ,జిల్లా అధికారులు నర్సరీలను 15 రోజులకోసారి సందర్శిస్తూ సూచనలు చేస్తున్నారు. సర్కారు ప్రతి పంచాయతీకో నర్సరీ ఏర్పాటు చేయడంతో అందరికీ ప్రయోజనం చేకూరుతున్నది.
నరేందర్ , ఈజీఎస్ ఈసీ ,భీంపూర్ మండలం