ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. 202 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 38,864 మంది విద్యార్థులకు గానూ 38,264 మంది హాజరయ్యారు. 600 మంది గైర్హాజరయ్యారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. ఆయా కేంద్రాలను విద్యాశాఖ అధికారులతోపాటు కలెక్టర్లు, ఇతర అధికారులు తనిఖీ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌కు డీఈవో మెమో జారీ చేశారు.
ఆదిలాబాద్ రూరల్/ నిర్మల్ అర్బన్/కుంటాల, మే 23 : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పదోతరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పేపర్ నిర్వహించగా, కేంద్రాలు విద్యార్థులు, తల్లిదండ్రులతో కిటకిటలాడాయి. ఉదయం 9:30 నుంచి 12:45 గంటల వరకు పరీక్ష జరిగాయి. 8:30 గంటల నుంచే తనిఖీ చేసి, కేంద్రాల్లోకి అనుమతించారు. 9:35 గంటల తర్వాత ఎవరినీ కేంద్రాల్లోకి అనుమతించలేదు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.
ఆదిలాబాద్‌లో 11,132 మంది పరీక్ష రాయగా, 156 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో టామ్నె ప్రణీత తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు. విద్యార్థులకు అసౌకర్యాలు లేకుండా చూడాలని సీఎస్‌లకు సూచించారు. 17 ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు తనిఖీ చేశాయి. అలాగే నిర్మల్ జిల్లాలో 9,719 మందికి గాను 9,628 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు డీఈవో రవీందర్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ ప్రభుత్వ ఉన్నత, కుంటాల ఆదర్శ పాఠశాలల్లోని పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, నిర్మల్ పట్టణంలోని గౌతమ్ మోడల్, వశిష్ట ఉన్నత పాఠశాలల్లోని పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ రాంబాబు పరిశీలించారు.
విద్యార్థులతో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ధైర్యంగా పరీక్ష రాయాలని సూచించారు. అనంతరం కేంద్రాల్లో విద్యార్థులకు కల్పించిన సదుపాయాలను పర్యవేక్షించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా చూడాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు, మెడికల్ క్యాంప్, ఓఎంఆర్ షీట్, హాజరు రిజిస్టర్, ప్రశ్నపత్రాలను పరిశీలించారు. అలాగే గౌతమ్ మోడల్, ఆశ్రమ, కస్బా ఉన్నత, వశిష్ట ఉన్నత పాఠశాలను డీఈవో రవీందర్ రెడ్డి పరిశీలించారు.