నేరడిగొండ, మే 9 : కొందరు తమ కక్షసాధింపు చ ర్య, స్వలాభం కోసం అమాయకులను బెదిరిస్తున్నారు. భూమి లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. కొంతకాలంగా కొనసాగిన ఈ వేధింపులు కాస్త.. ఇటీవల ప్రాణాలు తీస్తామనే స్థాయికి చేరాయి. దీంతో బాధిత కుటుంబాలు భయంతో పొలంలోకి వెళ్లి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో కలకలం రేపుతున్నది. బాధిత కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకా రం.. మండలంలోని బుద్దికొండ పంచాయతీ పరిధిలోని రాజులతండా గ్రామానికి చెందిన దేవిసింగ్, వారి అన్నదమ్ములు రాంసింగ్, సంతోష్, బాల్సింగ్, జ్ఞాన్సింగ్, నూర్సింగ్ కుటుంబాలు గ్రామంలోనే నివాసముంటున్నాయి.
వీరికి సం బంధించిన భూమి ఊరి పక్కనే ఉంది. ఆ భూ మిని గ్రామానికి అప్పగించాలని అదే గ్రామానికి చెందిన కొందరు వీరిపై ఒత్తిడి తెచ్చారు. కొంతకాలంగా ఈ వివాదం రగులుతుండగా, ఇటీవల వారిని చంపుతామని బెదిరించారు. భూమి విడిచి వెళ్లిపోవాలని, లేకుంటే ప్రాణాలు తీస్తామని బెదిరించి, చేను చుట్టూ ఉన్న కంచెను కూడా తొలగించారు. దీంతో బాధితులు భయం తో ఇళ్లకు తాళాలు వేసి, నాలుగురోజులుగా పొ లాల్లోనే గుడారాలు వేసుకొని బిక్కుబిక్కుమం టూ గడుపుతున్నారు. ప్రాణభయం ఉన్నదని అధికారులను కలిసి విన్నవించినా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు.
ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి, తమను రక్షించాలని వేడుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మహేందర్, డిప్యూటీ తహసీల్దార్ జగదీశ్వరీ, గిర్దవార్ నాగోరావ్, సిబ్బంది సోమవారం ఉదయం బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఈ సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. గుడారాలు వదిలి ఇంటికి వెళ్లాలని, అందరూ కలిసి ఉండాలని బాధిత కుటుంబాలకు నచ్చజెప్పారు.