నిర్మల్ అర్బన్, మే 9 : రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మల్ మున్సిపల్ అధికారులు,ప్రజాప్రతినిధులు ముంద స్తు చర్యలు చేపడుతున్నారు. గతేడాది మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు స్వర్ణ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వాగు పక్కనే ఉ న్న జీఎన్ఆర్ కాలనీ నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, అధికారులు వెంటనే చర్యలు చేపట్టడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. గత ఘటనలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ భారీ డ్రైనేజీల్లో పూడికతీతను తొలగిస్తూ నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపడుతున్నారు. వర్షాపు నీరు రోడ్లపైకి రాకుండా పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న భారీ డ్రైనేజీల్లో పూడికతీత పనులపై దృష్టి సారించారు.
పట్టణంలోని ప్రధాన వార్డుల్లో ఉన్న భారీ డ్రైనేజీలు చిన్నపాటి వర్షానికే పొంగిపొర్లి రోడ్లపై నీరు రావడంతో ప్రజలు ఇబ్బందు లు పడుతున్నారు. దీనిని శాశ్వతంగా పరిష్కరించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు సూచించడంతో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. నిర్మల్ మున్సిపల్ చైర్మ న్ ఈశ్వర్ వారం రోజులుగా శివాజీచౌక్, బుధవార్‌పేట్ కాలనీ, విజయనగర్ కాలనీ, శాంతినగర్ క్రాస్ రోడ్డు, నటరాజ్ మిల్, గొల్లపేట్ వంటి ప్రాంతాల్లో పర్యటించారు. ముఖ్యంగా మంచిర్యాల్ చౌరస్తా శివాజీ చౌక్ వద్ద కల్వర్టు వద్ద పూడికతీయకపోవడంతో చెత్తా చెదారం, పిచ్చి మొక్కలు పేరుకుపోయాయి. దీం తో జేసీబీ, ట్రాక్టర్లు, పారిశుధ్య సిబ్బంది సహాయంతో తొలగిస్తున్నారు.
రానున్న వర్షాకాలంలో ప్రజలు, వాహనదారులకు ఇబ్బందుల్లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాం. భారీ డ్రైనేజీల్లో పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం, కల్వర్టుల వద్ద పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తున్నాం. ప్రజలు కూడా తమ ఇంటి పరిసరాల్లోని డ్రైనేజీ, కాలువల్లో ప్లాస్టిక్, చెత్తను వేయకుండా పారిశుధ్య సిబ్బందికి అందించాలి. కాలువల్లో నీరు నిలిచిపోతే మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందిస్తే వెంటనే చర్యలు చేపడుతాం.
-నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్