ఎదులాపురం, మే 9 : కృషి, పట్టుదలతో ఉద్యోగాలు సాధించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. స్థానిక స్టడీ సర్కిల్లో నిర్వహిస్తున్న పోలీస్, గ్రూప్-1 పోటీ పరీక్షల ఉచిత శిక్షణ కార్యక్రమంలో సోమవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖల ద్వారా ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని యువత ఈ శిక్షణలో పాల్గొన్నారని తెలిపారు. శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల పోటీతత్వం పెరిగిందని, సాధన, ప్రణాళికతో చదువుకోవాలని సూచించారు. అనంతరం డీబీసీడీవో రాజలింగం మాట్లాడుతూ.. గ్రూప్-1 అభ్యర్థులకు మూడునెలల పాటు రూ.5వేలు చొప్పున, ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు రెండు నెలల పాటు రూ.2 వేల చొప్పున స్టయిఫండ్ చెల్లిస్తున్నట్లు చెప్పారు.
ప్రతి బ్యాచ్‌కు వంద మంది చొప్పున అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్ భీమ్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు యువత సన్నద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ స్డడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ఫ్యాకల్టీ, అభ్యర్థులు పాల్గొన్నారు.
కలెక్టరేట్లోని తన చాంబర్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలు, దళిత బంధు, ఉద్యోగ అవకాశాల కోసం ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించవద్దని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా శాఖల ద్వారా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు. అ దనపు కలెక్టర్లు ఎన్ నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్ ప్రజల నుంచి వివిధ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. ఈ సమావేశంలో ఆర్డీవో రాజేశ్వర్, జడ్పీ సీఈవో గణపతి, డీపీవో శ్రీనివాస్, ఎల్డీఎం చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.
జైనథ్, మే 9 : మండలంలోని చాందా(టీ) వద్ద కాలువ, వయోడ్రక్ బ్రిడ్జి పనులను కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. చనాకా-కొరాట బ్యారేజ్ గుండా చేపడుతున్న కాలువ నిర్మాణంలో భాగంగా డీ-14 నుంచి డీ19 వరకు అవసరమైన భూ సేకర ణ, లోయర్ పెన్‌గంగా పనులు వేగంగా పూర్తిచేయాలన్నారు.
డీ-16 కింద చేపట్టనున్న పనులు మైక్రో ఇరిగేషన్ కింద 10వ వంతు చేపట్టాల్సి ఉ న్నదని తెలిపారు. కాలువలకు అవసరమైన భూ మిని ఇరిగేషన్ అధికారుల ప్రతిపాదనల మేరకు సేకరించాలన్నారు. 1.675 కిలోమీటర్ల మేర ని ర్మించిన వయోడక్ బ్రిడ్జి పనులు, కాల పరిమితి, వ్యయంపై ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఈ పీ రాము, ఈఈ రవీందర్, ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.