ఎదులాపురం, ఆగస్టు 7 : జిల్లాలో అక్షరాస్యత శాతం చాలా తకువగా ఉందని, గ్రామాల్లో స్వయం సహాయక సంఘాలు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం ఉల్లాస్ నవ భారత్ సాక్షరత జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని డైట్ కళాశాలలో నిర్వహించారు. దీనికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు, అంగన్వాడీలు ఇంటింటికీ తిరుగుతూ నిరాక్షరాస్యుల వివరాలు తెలుసుకోవాలన్నారు.
జిల్లా స్థాయిలో ఆర్పీలు శిక్షణ పొందిన అనంతరం వలంటీర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రతి వలంటీర్ కనీసం 200 గంటలు చదువు చెప్పాలన్నారు. అలాగే నిరాక్షరాస్యులు కూడా 200 గంటల పాటు చదివిన తరువాతనే సర్టిఫికెట్ ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్డీవో రవీంద్ర రాథోడ్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు పాల్గొన్నారు.