ఎదులాపురం, జూలై 4 : ప్రైవేట్ దవాఖానలు నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా వైద్య సేవలందించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం లోని నక్షత్ర దవాఖానను శుక్రవారం తనిఖీ చేశారు. దవాఖానలో అందిస్తున్న వైద్య సేవలు, చికిత్స విధానాలు, రోగులకు అందిస్తున్న సౌకర్యాలు అంశాలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల హాజరు, చార్జెస్ బోర్డులు, కంప్యూటరైజ్డ్ బిల్లింగ్ వ్యవస్థ సానింగ్, డయాగ్నోస్టిక్ సర్వీసుల ప్రమాణాలు, ఆరోగ్య శ్రీ , ఇతర ఆరోగ్య బీమా సేవల అమలును పరిశీలించారు.
అలాగే మెడికల్ షాపును తనిఖీ చేసిన కలెక్టర్ షెడ్యూల్ హెచ్-1, షెడ్యూల్ ఎక్స్ మందులకు సంబంధించి లైసెన్సులపై లోపాలున్నట్లు గుర్తించారు. లైసెన్స్ లేకుండా ఫార్మాసీ నడుపుతున్నట్లు తేలడంతో సంబంధితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దవాఖానకు వచ్చే ప్రతి రోగికి ముద్రిత బిల్లును అందించాలన్న కలెక్టర్ రేట్ చార్ట్‌ను తెలుగు, ఇంగ్లిష్‌లో భాషలో స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. రేటు కార్డులో పేర్కొన్నదాని కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హాస్పిటల్ యాక్ట్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న దవాఖానాలపై అవసరమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్డియాక్ కన్సలెంట్ పేరు డీఎంహెచ్‌వో కార్యాలయంలో నమోదు చేయనందుకు నోటీసు జారీ చేయాలన్నారు. అలాగే విజిటింగ్ డాక్టర్ల వివరాలు తప్పని సరిగా నమోదు చేయాలని సూచించారు. స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ నిషేధానికి సంబంధించిన బోర్డులు అవసరమైన అనుమతి పత్రాలు ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీ సేవల విషయంలో రోగులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి రాథోడ్ నరేందర్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ సందీప్ ఐత్వార్, డాక్టర్ శిల్ప, ఆరోగ్య శ్రీ టీం లీడర్, తదితరులు ఉన్నారు.
ఆరోగ్యశ్రీ సేవలపై కలెక్టర్ స్పందన ..
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం పొందిన రోగితో కలెక్టర్ స్వయంగా ఫోన్లో మాట్లాడారు. చికిత్స సరళి సేవల నాణ్యతపై అభిప్రాయం అడిగారు. ఈ సందర్భంగా ఏమైనా అధిక ఫీజులు వసూలు చేశారా అనే ప్రశ్నకు తనకు మెరుగైన సేవలు అందించారని, ఎలాంటి అదనపు ఖర్చులు పెట్టలేదని రోగి వివరించారు.