ఆసిఫాబాద్ టౌన్,మే 20 : 2024-25 విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న మరమ్మతులు పూర్తవ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సురేందర్, జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ అధికారి రమాదేవి, జిల్లా పంచాయతీ శాఖ అధికారి భిక్షపతిగౌడ్తో కలిసి వివిధశాఖల అధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు.
పాఠశాలల అభివృద్ధి, ఏకరూప దుస్తులపై చర్చించారు. జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారని, తాగునీరు, మూత్రశాలలు, విద్యుద్దీకరణ పనులతో పాటు తరగతి గదుల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా 78 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.