ఆదిలాబాద్ : మహిళల భద్రతకు షీ టీం ( She Teams) బృందాలు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తుందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ( SP Akhil Mahajan ) తెలిపారు. జిల్లా వ్యాప్తంగా షీ టీం బృందాలు యువతులకు, విద్యార్థిని విద్యార్థులకు, పని స్థలాల్లో మహిళలకు ప్రత్యేకంగా 21 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్య పరుస్తున్నామని వెల్లడించారు.
ఏప్రిల్ నెలలో షీ టీం బృందాల ద్వారా నాలుగు ఎఫ్ఐఆర్( FIR ) కేసులు, పది పెట్టీ కేసులు నమోదు చేశామని వివరించారు. షీ టీం బృందాలు నెల రోజులలో 110 గ్రామాలు సందర్శించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు. వివిధ ప్రదేశాలలో ఉండి మహిళలను వేధిస్తున్న వారిని ఆదిలాబాద్‌కు రప్పించి కేసులను నమోదు చేయడంలో ఆదిలాబాద్ షీ టీం బృందాలు చురుకుగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు.
ఆపత్కాల సమయంలో షీ టీం బృందాల ను సంప్రదించాలంటే 87126 59953 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 42 హాట్స్పాట్లను గుర్తించి వాటిని ప్రతి వారం ఆకస్మికంగా తనిఖీ చేస్తూ పర్యవేక్షిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమాలలో చైల్డ్ మ్యారేజ్, గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్‌లపై, సైబర్ నేరాలు, సోషల్ మీడియాలలో జరుగుతున్న నేరాలపై అవగాహన కల్పిస్తూ యువతను చైతన్య పరుస్తున్నామని వివరించారు.