ఆదిలాబాద్, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో సోయాబిన్ కొనుగోళ్లకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా రేపు అడిషనల్ కలెక్టర్‌తో వివిధ శాఖల అధికారులు సమావేశం కానున్నారు. జిల్లాలో రైతులు వానకాలంలో 71,226 ఎకరాల్లో సోయా వేశారు. వాతావరణం, వర్షాలు అనుకూలించడంతో దిగుబడి ఆశాజనకంగా ఉంది. ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 4,27,356 క్వింటాళ్ల దిగుబడి అంచనా వేయగా.. ఈ మేరకు ఏర్పాట్లు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా వారం రోజుల్లో పంట కోతలు ప్రారంభంకానుండగా.. అధికారులు కొనుగోళ్లకు ప్రణాళికలు తయారు చేశారు. అడిషనల్ కలెక్టర్‌తో జరిగే సమావేశంలో వ్యవసాయశాఖ, మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, తూనికలు, కొలతల శాఖల అధికారులు పాల్గొంటారు. కొనుగోళ్లు ఎప్పుడూ ప్రారంభించాలనే విషయంతోపాటు రైతులకు ఇబ్బందులు కలుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. కొనుగోలు చేసే తేదీని నిర్ణయిస్తారు.
పూర్తిస్థాయి కొనుగోళ్లతో ప్రయోజనం
వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డుల్లో సోయా కొనుగోళ్లు జరగనుండగా.. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తారు. వ్యవసాయ సహాకార సంఘాలు రైతుల వద్ద నుంచి పంటను సేకరిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సోయాను క్వింటాలుకు రూ.4,892 మద్దతు ధర ప్రకటించగా.. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.4,650 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. కనీస మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో సోయా ధర తక్కువ ఉండడంతో రైతులు మార్క్‌ఫెడ్‌లో విక్రయించే అవకాశాలున్నాయి. ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసే ధర కంటే మద్దతు ధర ఎక్కువగా ఉండడంతో రైతులు భారీగా పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తారు. అన్నదాతలకు ఇబ్బంది కలుగకుండా చూడడంతోపాటు పూర్తిస్థాయిలో పంట కొనుగోళ్లు జరిగితేనే రైతులకు ప్రయోజనం ఉంటుందని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. నామమాత్రంగా కాకుండా చివరి గింజ వరకు పంటను సేకరించారించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని కోరుతున్నారు.