నార్నూర్ : ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Houses ) పంపిణీలో గందరగోళం జరిగిందని రాజ్ గోండు సేవా సమితి మండల అధ్యక్షుడు ఆత్రం పరమేశ్వర్ ( Parameshwar ) ఆరోపించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని కుమ్రం భీం కాంప్లెక్స్ లో కుమ్రం భీం విగ్రహం వద్ద మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన ఇందిరమ్మ కమిటీకి ( Committee ) తెలుపకుండా, ఎలాంటి గ్రామసభలు ఏర్పాటు చేయకుండా, పంచాయతీ కార్యదర్శులకు కూడా తెలియకుండా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారని దుయ్యబట్టారు. ఇప్పటికే అవకతవకలపై ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, తహసీల్దార్ జాడి రాజా లింగంకు వినతి పత్రం అందజేశామన్నారు.
పక్కా భవనాలు ఉన్నా, ప్రభుత్వ శాఖలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం ఇవ్వడం గమనార్హమని విమర్శించారు. ఇండ్ల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు కుమ్ర చతుర్షావ్, సిడం మాల్‌కు పటేల్, ఆత్రం భీం రావ్ తదితరులున్నారు.