సోన్, మే 11 : పరీక్షలు పూర్తి కావడంతో తన కూతురును ఇంటికి కారులో తీసుకొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు శంకర్(50), కృతిక(20) ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రవీందర్‌నగర్ కాలనీకి చెందిన శంకర్‌కు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న కూతురు కృతిక హైదరాబాద్‌లో బీటెక్ చదువుతోంది. పరీక్షలు ముగియడంతో తన తండ్రి శంకర్‌తో కలిసి కృతిక కారులో శనివారం రాత్రి భోజనం చేసి ఆదిలాబాద్‌కు పయానమయ్యారు. డ్రైవర్ విలాస్ కారు నడుపుతుండగా తన పక్క సీట్లో శంకర్, వెనక సీట్లో కూతురు కృతిక కూర్చున్నారు.
జాతీయ రహదారి-44 వద్ద గల నీలాయిపేట్ హైవే దగ్గరికి వచ్చేసరికి డ్రైవర్‌కు నిద్ర వచ్చింది. దీంతో ముందు ఆపుకుని ఉన్న డీసీఎం వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో శంకర్, కృతికలు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ విలాస్‌కు తీవ్ర గాయాలు కాగా.. మహారాష్ట్రలోని యావత్మాల్కు మెరుగైన చికిత్స కోసం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నిర్మల్ రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. శంకర్ ఆదిలాబాద్‌లోని బ్యాటరీ దుకాణం వ్యాపారం నడుపుతున్నట్లు సమాచారం. ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి చెందడంతో రవీందర్‌నగర్‌లోని విషాదఛాయలు అలుముకున్నాయి.