భీంపూర్/ఎదులాపురం, సెప్టెంబర్ 17 : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అర్లి(టి) గ్రామానికి చెందిన గొల్లి వైభవ్ యాదవ్(23), అదే గ్రామానికి చెందిన కారు యజమాని, డ్రైవర్ షేక్ సల్మాన్(26)లతో కలిసి ఆరుగురు బ్యాంకు ఉద్యోగులు మహారాష్ట్ర పర్యాటక ప్రాంతాలకు వెళ్తామని నిర్ణయించుకున్నారు. ఆదివారం, సోమవారం సెలవు కావడంతో ప్రయాణం పెట్టుకున్నారు. వీరందరు ఏపీ 28 /డీడబ్ల్యూ 2119 కారులో శనివారం రాత్రి బయలుదేరారు.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో చికల్దార చేరుకోగానే ప్రమాదవశాత్తు 200 అడుగుల లోతులో ఉన్న లోయలో కారు పడిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న గొల్లి వైభవ్ యాదవ్(25), షేక్ సల్మాన్(28), తాంసి మండలం కప్పర్ల తెలంగాణ గ్రామీణ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన శివకృష్ణ(31), భీంపూర్ గ్రామీణ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన కోటేశ్వరరావు(27) మృత్యువాత పడ్డారు. బేల గ్రామీణ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్‌గా పని చేస్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన హరీశ్(30), బేల బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన కె.యోగేశ్యాదవ్(25), జైనథ్ మండలం పెండల్వాడ గ్రామీణ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సుమన్(24), భీంపూర్ మండలం అర్లి(టి) గ్రామీణ బ్యాంకులో పనిచేస్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన శ్యామ్ సుందర్(29)లు గాయపడిన వారిలో ఉన్నారు. బ్యాంకు ఉద్యోగులలో శివకృష్ణ, హరీశ్, డ్రైవర్ తప్పా మిగతా వారు అవివాహితులే.
భీంపూర్ మండలంలో విషాదఛాయలు
భీంపూర్ మండలంలోని అర్లి(టి) గ్రామ సర్పంచ్ గొల్లి రమాబాయి-లస్మన్న దంపతుల ఏకైక కుమారుడు, బీఆర్ఎస్ యువ నాయకుడు వైభవ్యాదవ్ మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. వైభవ్‌కు ఒక సోదరి కాగా, ఇతనికి పెండ్లి ఈ యేడాదే ఉన్నట్లు సమాచారం. పల్లె ప్రగతి సహా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడంలో వైభవ్ కీలకంగా, క్రియాశీలకంగా ఉండేవాడు. సల్మాన్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సమాచారంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. బంధువులు, జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, నాయకులు ఉల్లాస్ దేశ్‌ముఖ్, కపిల్, నరేందర్‌యాదవ్ మహారాష్ట్రకు వెళ్లారు.