ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, ఫిబ్రవరి 13 : ప్రతి ఒకరూ ఆధార్ కార్డు కలిగి ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి యుఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ చైతన్యకుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సభ్యులతో కలిసి పాల్గొన్నారు కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు పొందాలంటే విద్యార్థులకు ఆధార్ కార్డు తప్పనిసరి అన్నారు. ఐదేళ్లలోపు పిల్లలు సుమారు 36,679 మంది ఉన్నారని, వీరందరికీ ఆధార్ నమోదు చేసేందుకు జిల్లా సంక్షేమ శాఖ, విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖలు కృషి చేయాలన్నారు. ఆధార్ నమోదు, అప్డేట్ కోసం ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లో మెగా క్యాంపులు నిర్వహించాలని సూచించారు. ఆధార్ కార్డులు ఇంటింటికీ త్వరగా చేరుకునేలా తపాలాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారాం, ముఖ్య ప్రణాళిక అధికారి కోటయ్య, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి ఆడెపు భాసర్, విద్యాశాఖ అధికారులు, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ గౌతమ్ రాజు, తపాలా శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణలో వారే కీలకం
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో స్టేజ్-1, 2 అధికారులే కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావు, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి గౌడ్‌తో కలిసి కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ డివిజన్లలోని స్టేజ్-1, 2 అధికారులు, సిబ్బందికి వేర్వేరుగా నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను సమన్వయంతో పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టేజ్-1, 2 అధికారులు, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.