కాసిపేట, డిసెంబర్ 1 : కాసిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో రెండు వర్గాల ఆధిపత్య పోరు మరో సారి తెర మీదకు వచ్చింది. కాసిపేట మండలంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల ఎమ్యెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావుకి చెందిన నాయకులు రెండు వర్గాలుగా వేర్వేరుగా కాంగ్రెస్ క్యాడర్ కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రెండు వర్గాల క్యాడర్ ఎవరికి వారు సైతం తమ మద్దతుదారులను సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో రంగంలోకి దించుతున్నారు. ఎవరికి వారు తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు తమ ఆధిపత్యం నిలుపుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఇటీవల దేవాపూర్ ఓరియంట్(అదానీ) సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంత్రి గడ్డం వివేక్ కాంగ్రెస్ పార్టీ తరఫున తమ మద్దతుదారుడిని నిలబెట్టగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు సోదరుడు సత్యపాల్‌రావు స్వతంత్రంగా పోటీ చేస్తున్నానని ప్రకటించి పోటీ చేయగా వెనుక ఉండి నడిపి ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు తన పట్టు నిలుపుకొని తమ్ముడిని సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం అధ్యక్షుడిగా గెలిపించుకున్నారన్నది చర్చనీయాంశమైంది. దీంతో ఆధిపత్య పోరు మరింత ముదిరిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా సోమవారం దేవాపూర్‌లో సిమెంట్ కంపెనీ అధ్యక్షుడు సత్యపాల్‌రావు తన మద్దతుదారులైన వారు సర్పంచ్, వార్డు సభ్యులగా బరిలోకి దిగారు. మండలంలో రెండు వర్గాల క్యాడర్లు ఎవరికి వారు తమ మద్దతుదారులను నామినేషన్లు వేయిస్తూ తమ ఆధిపత్యం చూపించుకునేందుకు పట్టు మీద ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతున్నది. రెండు వర్గాల క్యాడర్ రంగంలోకి దిగి ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. ఎవరి వర్గంపైయి ఉంటుందోనని గ్రామాల్లో చర్చ కొనసాగుతున్నది.