నిర్మల్, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ) : ప్రజా వైద్య సేవలు మెరుగపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. దీనిలో భాగంగా జిల్లా కేంద్రాల్లోని దవాఖానలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అవసరమైన వసతులు కల్పిస్తున్నది. కాగా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికోసం నిర్మల్ జిల్లా దవాఖానలో పాలియేటివ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం ఆధ్వర్యంలో గత 10 నెలల్లో 900 మందికి పైగా రోగులకు చికిత్స అందించింది. పేదల సంజీవనిలా మారిన పాలియేటివ్ కేర్ సెంటర్ పై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం..
రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన, కార్పొరేటు స్థాయి వైద్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నది. ఈ క్రమంలోనే వైద్య సేవలను విస్తరించేందుకు ప్రభుత్వ దవాఖానల్లో పలు కీలక విభాగాలను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా దవాఖానలో ఏర్పాటు చేసిన పాలియేటివ్ కేర్ సెంటర్.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు అండగా నిలుస్తున్నది. గతేడాది మార్చిలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభమైన ఇక్కడి సెంటర్లో ఇప్పటివరకు జిల్లా నలుమూలలకు చెందిన 900కు పైగా బాధితులు చికిత్స పొందారు.
‘ఆలన, ఆరాధన, సేవ’ నినాదంతో పాలియేటివ్ కేర్ సెంటర్లో అందుతున్న సేవలపై రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్‌పేషెంట్, ఔట్ పేషెంట్ విభాగాలతోపాటు హోమ్ కేర్ సేవల ద్వారా అవసరమైన రోగులకు ఇక్కడి సిబ్బంది వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఇక్కడి కేంద్రంలో మొత్తం ఆరు పడకలను ఏర్పాటు చేశారు. క్యాన్సర్, కిడ్నీ, లివర్ సంబంధిత తీవ్రమైన వ్యాధులతో బాధ పడుతూ… ఇక వైద్యం చేసినా ప్రయోజనం లేని పరిస్థితిలో ఉన్న రోగులందరినీ ఈ కేంద్రం అక్కున చేర్చుకుంటున్నది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ సెంటర్ ద్వారా అవసరమైన కౌన్సెలింగ్ ఇచ్చి మానసిక స్థెర్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇందుకోసం ఇక్కడి సెంటర్లో ఒక డాక్టర్, ముగ్గురు నర్సింగ్ స్టాఫ్, మరో ముగ్గురు హెల్పర్లు (ఆయాలు), ఒక డ్రైవర్‌ను ప్రత్యేకంగా నియమించారు. తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టిన రోగులతోపాటు ఇంటి వద్ద తమ కుటుంబ సభ్యుల నిరాదరణకు గురైన వారు కూడా ఇక్కడి సెంటర్లో చేరుతున్నారు. వీరికి చికిత్సలతోపాటు, మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని అందజేస్తూ వారి ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు.
అవసరమైన వారికి ఇంటి వద్దనే చికిత్స..
నయం కాని జబ్బులతో బాధపడుతూ.. అనేక ఇబ్బందులతో చివరి రోజులను గడుపుతున్న వారికి ఈ పాలియేటివ్ సెంటర్లు ఉపయోగపడుతున్నాయంటున్నారు. ఈ కేంద్రం ద్వారా క్యాన్సర్, హెచ్ఐవీ, షుగర్, కిడ్నీ, లివర్, పక్షవాతం వ్యాధులతో బాధపడుతున్న పేదలు, అనాథలకు పూర్తి ఉచితంగా సేవలు అందుతున్నాయి. ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ సేవలతోపాటు అవసరమైన వారికి ఇంటి వద్దకే వెళ్లి చికిత్స అందజేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి పాలియేటివ్ సెంటర్‌కు ఒక వాహనాన్ని కేటాయించింది. ఈ వాహనం ద్వారా 40 కిలో మీటర్ల పరిధిలో ఉన్న రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి అవసరమైన మందులను అందజేసి, ఎలాంటి నొప్పి, బాధ లేకుండా ఉండేందుకు అవసమైన చికిత్సలు చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 133 గ్రామాలకు వెళ్లి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న 903 మందికి చికిత్స చేశారు. వీరితోపాటు ఔట్ పేషెంట్లు 221 మంది, ఇన్ పేషెంట్లు 177 మందికి ఇక్కడి పాలియేటివ్ సెంటర్ ద్వారా సేవలు అందాయి. దేశంలో తెలంగాణ తర్వాత ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఇలాంటి సేవలు అందుతున్నాయని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. ఎంతో దూర దృష్టితో అభాగ్యుల కోసం ఉచితంగా ఇంత మంచి సేవలు అందిస్తున్న సీఎం కేసీఆర్ పది కాలాలపాటు వర్ధిల్లాలని బాధితులు కోరుకుంటున్నారు.
రోగులకు సేవలందించడమే మా లక్ష్యం…
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలియేటివ్ కేర్ సెంటర్ ప్రధాన ఉద్దేశం చాలా బాగుంది. చివరి దశలో ఉన్న రోగులకు ఈ సెంటర్ వరం లాంటిది. తనతోపాటు ఇక్కడ పని చేసే ప్రతి ఒక్కరూ రోగులకు సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తారు. క్యాన్సర్, పక్షవాతం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ పాలియేటివ్ కేర్ సెంటర్లో సేవలు పొందవచ్చు. క్యాన్సర్ పేషెంట్లకు కీమో థెరపీ, రేడియో థెరపీ చేయడం వల్ల విపరీతమైన నొప్పులు ఉంటాయి. వాటి నుంచి ఉపశమనం కలిగించేందుకు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మాత్రమే దొరికే మార్ఫిన్ డ్రగ్‌ను ఇక్కడికి వచ్చే పేషెంట్లకు ఇస్తాం. దీంతో వారికి బాధ తెలియకుండా ప్రశాంతంగా గడిపే అవకాశం కలుగుతుంది. కనీసం ఎవరి పనులు వారు చేసుకోలేని స్థితిలో ఉండి, తమ వల్ల కుటుంబ సభ్యులు ఇబ్బందిపడే పరిస్థితి ఉన్నవారు ఈ సెంటర్‌ను వినియోగించుకోవచ్చు. ఇక్కడ మూడు పూటలా భోజనంతోపాటు 24 గంటలు సపర్యలు చేసేందుకు సిబ్బంది ఉన్నారు.
– డాక్టర్ తుల శ్రీజన్య, పాలియేటివ్ కేర్ సెంటర్, నిర్మల్.
సొంత మనుషుల్లా చూస్తున్నరు..
నాకు రెండేళ్ల క్రితం గొంతు దగ్గర సమస్య రావ డంతో దవాఖానలో పరీక్షలు చేయించు కున్న. క్యాన్సర్ వచ్చిందని చెప్పిన్రు. కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో 33 సార్లు రేడియేషన్ చేశారు. ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్న. సుస్తీ చేసినప్పుడు ఇక్కడికి వస్త. ఇక్కడి డాక్టర్లు, సిబ్బంది సొంత మనుషుల్లా చూసుకుం టరు. ఉన్నన్ని రోజులు మంచి ఆహారం ఇస్తరు. ఆరోగ్యం కొంత కుదుటపడగానే మందులు తీసుకొ ని ఇంటికి వెళ్తా. మాలాంటి పేదలకు ఎలాంటి ఖర్చు లేకుండా ఇక్కడ వైద్యం అందుతున్నది.
– జక్కుల కృష్ణ, క్యాన్సర్ బాధితుడు, వడ్యాల్.
రెండు నెలల నుంచి వస్తున్నా…
గత రెండు నెలలుగా ఇక్క డికి వచ్చి చికిత్స పొం దుతున్న. నాకు షుగర్ ఎక్కువ కావడంతో ఏడు నెలల క్రితం కిడ్నీలు చెడిపోయా యని డాక్టర్లు చెప్పారు. చాలా ఇబ్బందిగా ఉంది. శరీరం సహకరించడం లేదు. కాళ్ల వాపు, తిమ్మిర్ల బాధ ఎక్కువైంది. ఇక్కడ డాక్టర మ్మ, నర్సులు మంచి ట్రీట్మెంటు ఇస్తున్నరు. మం చి భోజనం పెడుతూ చాలా కేర్ తీసుకుం టున్నరు. మా లాంటి వారికి ఇంత గొప్ప సేవలందిస్తున్న పాలియేటివ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ సార్‌కు తనతో పాటు తన కుటుంబ సభ్యులంతా జీవితాంతం రుణపడి ఉంటాం.
– బాపన్న, కిడ్నీ వ్యాధిగ్రస్తుడు, బండలఖానాపూర్.