కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ‘ఆదివాసీల మీద అప్రకటిత యుద్ధం.. మావోయిస్టులారా తీరవా.. మీ రక్త దాహాలు, ఇదేనా మీ సిద్ధాంతం..? ఇందుకోసమేనా మీ పోరాటం..? మావోయిస్టులపై ఆదివాసులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి జాగ్రత్తా !’ అని ప్రశ్నిస్తూ హెచ్చరికలతో ఆదివాసీ యువజన సంఘం, తెలంగాణ రాష్ట్రం పేరిట అంటించిన పోస్టర్లు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి, బెజ్జూర్ మండలాల్లో కలకలం రేపాయి. ములుగు జిల్లాలోని వాజెడు, వెంకటాపురం మండలాల్లోని ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న కర్రెగుట్ట పేలుడు ఘటన, మందుపాతర అమర్చడంపై మావోయిస్టులు చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ.. ముద్రించిన పోస్టర్లు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.
ఈ పోస్టర్లపై చింతలమానేపల్లి మండలం కర్జవెల్లి, బెజ్జూరు మండల కేంద్రంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆదివాసీ సంఘం పేరిట మావోయిస్టులకు హెచ్చరికలు జారీ చేయడంతో ఈ ప్రాంతంలో పోలీస్ శాఖ అప్రమత్తమై ప్రత్యేక నిఘా పెంచారు. వీటిని ఆదివాసీ సంఘం నాయకులు పోస్టర్లను అంటించారా ? లేదా ? ఇంకా ఎవరైనా ఇలాంటి పని చేశారా ? అనే దానిపై పోలీసులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నారు. ములుగు జిల్లాలో జరిగిన ఘటనను ఇక్కడ ప్రస్తావిస్తూ వాల్ పోస్టర్లు అంటించి మావోయిస్టులకు సవాల్ విసరడంపై చర్చనీయాంశమైంది.