ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతుపైకి ‘నకిలీ’ కత్తి దూసుకొస్తున్నది. సీజన్కంటే ముందే గ్లైసిల్ పత్తి విత్తనాల దందా జోరుగా సాగుతున్నది. దళారులు పలు ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అమాయక రైతులకు అంటగడుతూ అందినకాడికి దండుకుంటుండగా, యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించడం ఆందోళన కలిగిస్తున్నది.
మంచిర్యాల, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా తాండూర్‌తో పాటు కన్నెపల్లి, భీమిని, నెన్నెల, చెన్నూర్ రూరల్, జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేటతో పాటు ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం, కాగజ్‌నగర్, చింతలమానేపల్లి, సిర్పూర్, బెజ్జూర్ మండలాలకు ైగ్లెసిల్ పత్తి విత్తనాలు సరఫరా అయ్యాయి. ఇటీవల ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలో ఇటీవల రూ.10.50 లక్షల విలువైన మూడు క్వింటాళ్లు, మార్చి నెలాఖరున మంచిర్యాల జిల్లా తాండూర్‌లో రూ.6.17 లక్షలు విలువైన 247 కిలోల పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. అంతకుముందు కర్ణాటక నుంచి మంచిర్యాలకు డీసీఎంలో తీసుకొస్తున్న 37.5 క్వింటాళ్ల పత్తి విత్తనాలను శామీర్‌పేట్ ఓఆర్ఆర్ సమీపంలో స్వాధీనం చేసుకోగా, దందా ఏ మేరకు సాగుతున్నదో అర్థమవుతున్నది.
రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా భీమిని, కన్నెపల్లి, బెల్లంపల్లి, చెన్నూర్, కాగజ్‌నగర్ ప్రాంతాలకు ఏపీ నుంచి వలసవచ్చే దళారులు స్థానికంగా ఉంటూ రైతులతో పరిచయాలు పెంచుకుంటున్నారు. ఇక్కడ భూమిని కౌలు చేయడమో లేదా తోటలు లీజ్ తీసుకోవడమో చేసి రైతులను ఆకర్షిస్తున్నారు. పత్తులు విత్తే సమయానికి విత్తనాలు తీసుకురావడం కష్టమని, ముందుగానే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లోనే గ్రామీణ ప్రాంతాలను వాటిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో పట్టుబడే విత్తనాలు కొద్ది మొత్తంలో ఉంటే, గుట్టుచప్పుడు కాకుండా గమ్యం చేరుతున్న విత్తనాలు పెద్ద మొత్తంలో ఉంటున్నాయి.
మహారాష్ట్ర సరిహద్దులో ఉండే మండలాల్లో ఇప్పటికే ైగ్లెసిల్ విత్తనాలను డంప్‌ల కొద్ది స్టోర్ చేసినట్లు తెలుస్తున్నది. బెల్లంపల్లిలోని ఓ వ్యాపారి ఈ ైగ్లెసిల్ విత్తనాలు అమ్ముతున్నాడు. ఆయనే భీమిని, నెన్నల, దహెగాం తదితర ప్రాంతాల్లోని చిన్న వ్యాపారులకు వీటిని పంపిస్తున్నాడు. తాండూరు మండలంలో సైతం ఓ వ్యాపారి ఈ ైగ్లెసిల్ విత్తనాల వ్యాపారం చేస్తున్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సైతం మంచిర్యాల జిల్లాలోని కొన్ని మండలాల్లో ఈ దందా చేస్తున్నారు. గతంలో ఈ వ్యవహారంలో దొరికినా ఆయన మళ్లీ అవే విత్తనాలు అమ్ముతున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో పని చేస్తున్న ఓ ప్రభుత్వ టీచర్ గతంలో మంచిర్యాలలో పని చేశారు. ఆయన తన పరిచయాలను ఉపయోగించి నకిలీ విత్తనాల రాకెట్‌ను నడిపిస్తున్నట్లు తెలిసింది. గతంలో ఓ సారి పీడీ యాక్ట్ కేసు నమోదైనప్పటికీ ఈ సారి ఆయన వెనక్కి తగ్గడం లేదని సమాచారం.
ైగ్లెసిల్ పత్తి విత్తనాల దందాను అధికార పార్టీ లీడర్లు అద్భుతంగా వాడుకుంటున్నారు. లక్షెట్టిపేట మండలంలో ఓ గ్రామ మాజీ సర్పంచ్‌గా చేసిన వ్యక్తి లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల్లోని అన్ని గ్రామాలకు నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్నారు. మందమర్రిలో అధికార పార్టీ నాయకుడు జిల్లాలో దందాకు కేంద్ర బిందువుగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన మండలాల్లోని అధికార పార్టీ నాయకులు పత్తి విత్తనాల దందాలో దూసుకుపోతున్నారు.
విత్తనాలు వస్తున్నాయంటే ముందే పోలీసు శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులకు మామూళ్లు వెళ్లిపోతున్నాయన్న ఆరోపణలున్నాయి. మండలం, అక్కడ ఉన్న వ్యవసాయ భూముల లెక్కల ఆధారంగా అధికారులకు డబ్బులు అప్పగిస్తున్నట్లు తెలుస్తున్నది. గతేడాది రూ.80వేలు ఇచ్చారని ఈ సారి ఎక్కువ మొత్తం వస్తుందంటూ వ్యవసాయ శాఖలో పని చేసే ఓ అధికారి ఆయన సన్నిహితుల దగ్గర చెప్పుకొచ్చారు. విత్తనాల దందా కాసులు కురిపిస్తుండడంతో అధికారులు సైతం మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భీమిని మండలంలో ఉండే ఆంధ్రా ప్రాంతానికి చెందిన దళారుల సాయంతో గతేడాది ైగ్లెసిల్ విత్తనాల దందా చేసిన ఓ లీడర్ ఈ సారి తన హవాను కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ లీడర్లు అన్నింటికీ ముందు పడుతుండడంతో నకిలీ దందా మూడు పూలు.. ఆరు కాయలుగా సాగుతున్నది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి చేతులు మారుతూ నకిలీ పత్తి విత్తనాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు నకిలీ విత్తనాలను అరికట్టే దిశగా కఠిన చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉన్నది.
అంతకుముందు ఏడాది దాదాపు 60 శాతం మంది రైతులు ైగ్లెసిల్ విత్తనాలతో సాగు చేశారు. సాధారణంగా ప్రభుత్వ ఆమోదిత పత్తి విత్తనాలైతే కలుపు ఎక్కువగా ఉంటుంది. అదే ైగ్లెసిల్ పత్తి విత్తనాలైతే గడ్డి పెరగదు. కలుపు కష్టం లేకుండానే మంచి దిగుబడి వస్తుందని రైతులు వీటిపైపు మొగ్గు చూపుతున్నారు. ైగ్లెసిల్ విత్తనాలు పర్యావరణానికి హానికరం. వాటిని వేస్తే నేల నిస్సారం అవుతుంది.
దీర్ఘకాలంలో అది భూమిపై ప్రభావం చూపిస్తుంది. ఈ విషయాలన్నీ రైతులకు వివరిం చడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీంతో గడిచిన ఐదేళ్లుగా నకిలీ విత్తనాల సమస్య పెరిగిపోతూనే ఉంది. యేటా కోట్ల రూపాయలు చేతులు మారే ఈ నిషేధిత ైగ్లెసిల్ పత్తి విత్తనాల రాకెట్‌ను అదుపుచేయడంలో అధికారులు ఘోరంగా విఫలం అవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.