ఆదిలాబాద్, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా రైతులు యాసంగిలో పండించిన జొన్నలను అమ్ముకోవడానికి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొన్నది. పంట చేతికొచ్చిన కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఏటా యాసంగిలో జొన్న సాగు చేస్తారు. వానకాలంలో అధిక వర్షాల కారణంగా రైతులు పత్తి, సోయా పంటలను నష్టపోయారు. ఈ నష్టాన్ని కొంత వరకు పూడ్చుకుందామనుకున్న రైతులకు నిరాశే మిగులుతున్నది.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా, మద్దతు ధర చెల్లించకుండా ఉండడంతో రైతులు ప్రైవేటులో అమ్మి నష్టపోతున్నారు. కాగా.. బీఆర్ఎస్ హయాంలో వానకాలం, యాసంగి పంట ఉత్పత్తులను మద్దతు ధరతో కొనుగోలు చేశారు. కోతకు రాకముందుగానే బీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోళ్లకు ప్రణాళికలు రూపొందించి, గ్రామాలవారీగా పంటను సేకరించింది. ప్రస్తుతం రైతులు పంట ఉత్పత్తులను అమ్ముకొనేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జొన్న పంటను కొనుగోలు చేయాలంటూ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మార్క్ఫెడ్ అధికారులను కలిసి వినతిపత్రం అందించారు. కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఇండ్లు, చేల వద్ద పంటను నిల్వ చేసుకొని రాత్రి, పగలు కాపల కాస్తున్నారు. వర్షం వస్తే తడుస్తాయని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే మద్దతు ధరతో జొన్న పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
కొనుగోళ్లు ప్రారంభించాలి..
నేను యాసంగిలో పదెకరాల్లో జొన్న సాగు చేశా. ఎకరాకు 22 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇప్పటికే పంటను కోసి గ్రామ శివారులో నిల్వ చేశా. ప్రభుత్వం జొన్నలను మద్దతు ధరతో కొనుగోలు చేసే విషయంలో ప్రకటన చేయలేదు. ప్రైవేటులో పంటను అమ్ముకుందామంటే క్వింటాలుకు రూ.2500 వరకు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారని ఎదురు చూస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో పూర్తిస్థాయిలో కొనుగోలు చేశారు. ప్రభుత్వం రైతులు నష్టపోకుండా కేంద్రాలను వెంటనే ప్రారంభించి, మొత్తం పంటను కొనుగోలు చేయాలి.
– శార్థ నవీన్, రైతు, కజ్జర్ల, తలమడుగు మండలం
ఆదిలాబాద్ జిల్లాలో జొన్న సాగు
సాగు : 80 వేల ఎకరాలు
దిగుబడి : 22 నుంచి 25 క్వింటాళ్లు(ఎకరాకు)
మద్దతు ధర(క్వింటాలుకు) : రూ.3,749
ప్రైవేటులో(క్వింటాలుకు) : రూ.2,500
రైతులకు నష్టం : రూ.1,249