ఎదులాపురం, ఏప్రిల్ 5 : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ విధానం అమల్లోనే ఉందని.. మనతో విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌లో రద్దయి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కార్పొరేషన్ చేశారని ఆదిలాబాద్ జిల్లా ఔట్సోర్సింగ్ జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండ శీను, అగ్గిమల్ల స్వామి అన్నారు. శనివారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
మహిళలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలన్నారు. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, అదేవిధంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. ఆ కుటుంబంలో ఒకరికీ ఉద్యోగం కల్పించాలని కోరారు. ఈ విషయంపై హరీశ్‌రావు సానుకూలంగా స్పందిస్తూ.. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఆయనను కలిసిన వారిలో జేఏసీ వరింగ్ ప్రెసిడెంట్ పుల్లూరి రవి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామగిరి సంతోష్, జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్ముల నరేశ్, కోశాధికారి దువాస గోపాల్, సతీశ్, సంఘర్ష్ రెడ్డి ఉన్నారు.