తాండూర్ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్ (Union Budget) దశ, దిశానిర్దేశం లేనిదిగా కనిపిస్తోందని సీఐటీయూ ( CITU ) మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం ఆరోపించారు. తాండూర్ మండల కేంద్రంలో సోమవారం సీఐటీయూ నాయకులతో కలిసి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై నిరసన తెలిపారు. ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అన్నారు.
ఆర్థిక సర్వే 2025-26 భారత ఆర్ధిక వ్యవస్థ ఒక క్లిష్ట దశకు చేరుకుందని, భౌగోళిక రాజకీయ మార్పులు పెట్టుబడులు, వృద్ధిపై ప్రభావం చూపుతాయని అంగీకరించినప్పటికీ, వీటిని ఎదుర్కోవడానికి బడ్జెట్లో ఎటువంటి విధానపరమైన మార్పులు చేపట్టలేదని ఆరోపించారు. ఈ బడ్జెట్ ప్రపంచ పెట్టుబడిదారి సంక్షోభ భారాన్ని కార్మికులు, సామాన్య ప్రజలపై నెట్టడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.
కార్మిక హక్కులను కాలరాసే లేబర్ కోడ్ల అమలు, నాణ్యత ప్రమాణాల తగ్గింపు వంటి చర్యల ద్వారా దేశీయ పరిశ్రమలను దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విధానాలకు నిరసనగా ప్రజలంతా వీధుల్లోకి వచ్చి ఫిబ్రవరి 12న జరగబోయే సాధారణ సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికులు దుర్గం నానయ్య, జాడి శంకర్, జైనేని రాజయ్య, కార్మికులు పాల్గొన్నారు.