లోకేశ్వరం, మే 8 : నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని గోదావరి ఒడ్డున గల పురాతన కాలంనాటి బ్రహ్మేశ్వర ఆలయ ప్రాంగణంలో 9- 12వ శతాబ్దాల మధ్య కాలానికి చెందిన అరుదైన శిల్పాలు, విగ్రహాలు వెలుగులోకి వచ్చినట్లు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు డా. తుమ్మల దేవరావు తెలిపారు. గోదావరి తీరాన వెలిసిన బ్రహ్మేశ్వరాలయం బౌద్ధ, జైన, శాక్తేయ, భైరవ సంప్రదాయాలకు కేంద్రంగా అభివృద్ధి చెందిందని, ఉప ఆలయాలు, శిథిల నిర్మాణాలతో కూడిన ఆలయ సముదాయంలో నాగవీరుడు విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నదన్నారు.
నాగారాధన లేదా యుద్ధంలో వీరమరణం పొందిన యోధుడి జ్ఞాపకార్థంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. గుర్రంపై కత్తి, డాలు ధరించి ఉన్న వీరుడి రూపంతో ఉన్న వీరగల్లు విగ్రహంతో పాటు జైన సంప్రదాయంలోని యక్షిణి పోలిక ఉన్న లజ్జాగౌరి స్త్రీమూర్తి విగ్రహాన్ని గుర్తించినట్లు తెలిపారు. వీటితో పాటు సప్తమాతృకల శిల్పాలు, స్తంభాలు, శివలింగాలు, శిలాఖండాలు ప్రాంగణమంతా విస్తరించి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ శిల్ప సంపదను పురావస్తు శాఖ సంరక్షించాలని కోరారు.