ఇటీవల మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ హోటల్లో పేక ఆడుతూ 9 మంది దొరికారు. వీరిలో ఒకరు జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన త్రీ స్టార్ హోటల్లో, టాప్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ కలిగిన వాటాదారుడు. మరొకరు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో కీలక పార్ట్నర్. ఈయన్ని ‘టచ్’ చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సినంత పలుకుబడి ఉన్న వ్యక్తి. ఇందులో మంచిర్యాల మున్సిపల్ వార్డు కౌన్సిలర్ భర్త సహా మరో ప్రముఖ వ్యాపార వేత్త కూడా ఉన్నారు.
ఇక మిగిలిన వారు సైతం ఎంతోకొంత రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులే. దీంతో ఈ కేసులో పోలీసులు ఇంటి పేర్లతో సహా వివరాలు వెల్లడించలేకపోయారు. జూలై 10న రామగుండం పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ గ్రూప్‌లో ఇంటి పేర్లతో సహా పత్రికా ప్రకటన పెట్టారు. ఆపై వెంటనే పీఆర్వో దాన్ని డిలీట్ చేశారు.
కాసేపటికే మంచిర్యాల పోలీసులు ఇంటి పేర్లు లేకుండా మరో ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం తొమ్మిది మంది ఇంటి పేర్లను కావాలనే గోప్యంగా ఉంచారనే విమర్శలు వచ్చాయి. కమిషనరేట్ గ్రూప్‌లో ఇంటి పేర్లతో సహా పెట్టిన ప్రెస్ రిలీజ్‌ను డిలీట్ చేయించి, లోకల్ పోలీసులు మరొకటి విడుదల చేయడం సీపీకి తెలిసి జరిగిందా.. తెలియక జరిగిందా.. తెలియదుగానీ.. పోలీసుల వ్యవహారంపై మాత్రం తీవ్రమైన చర్చ జరిగింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని గుంటూరు కాలనీలో సెప్టెంబర్ 1న రాత్రి ఓ ఇంట్లో పేక ఆడుతున్న తొమ్మిది మంది పట్టుపడ్డారు. ఈ ఘటనలో ఎనిమిది మంది పేర్లను ఇంటి పేర్లతో సహా పేర్కొంటూ పత్రికా ప్రకటన ఇచ్చిన పోలీసులు, మంచిర్యాల జిల్లాలో బార్ అండ్ రెస్టారెంట్ కలిగిన ఓ వ్యక్తి ఇంటి పేరును మాత్రం తప్పించారు.
దీంతో ఆయన ఎవరో తెలియకుండా పోయింది. దీనిపై కాగజ్‌నగర్‌లో పని చేసే ఓ పోలీసు అధికారిని వివరణ కోరితే.. ఆయన పేరు పెట్టకపోవడానికి ‘వాలా’ చట్టం ఏదో అడ్డువచ్చిందని వ్యంగ్యంగా పేరు చెప్పకనే చెప్పినట్లు చెప్పారు. ఈ ఘటనలో పట్టుబడిన డబ్బు లెక్కలు చూపించడంలోనూ తేడాలున్నాయనే ఆరోపణలు వచ్చాయి. పోలీసులు మాత్రం అలాంటివేవీ లేవని స్పష్టం చేశారు.
మంచిర్యాల, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చట్టం దృష్టిలో అందరూ సమానమే. కానీ.. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో మాత్రం కొందరు పెద్దోళ్లకు ఆ చట్టం చుట్టంగా మారింది. కొంత డబ్బు, పలుకుబడి ఉంటే చాలు ప్రముఖులన్న పేరుతో వారు ఏమైనా చేయవచ్చు అన్నట్లు పోలీసులు వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు. పెద్దమనషులు, వ్యాపారవేత్తల ముసుగులో వాళ్లు ఏం చేసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తారు.
చేసేది ఇల్లీగల్ పని అని తెలిసినా.. వాళ్ల పేర్లు గోప్యంగా ఉంచడం అంటే వాళ్లను ప్రోత్సహించడం కాదా… పేరు బయటికి వస్తే పరువు పోతుందన్న భయానికైనా జూదం ఆడరు కదా… ఈ కోణంలో పోలీసులు ఎందుకు ఆలోచించరనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతున్నది. సామాన్య జూదరులు దొరికితేనేమో వాళ్ల ఇంటి పేర్లు, అడ్రస్‌లతో సహా వివరాలు వెల్లడించే పోలీసులు ప్రముఖులు దొరికినప్పుడు మాత్రం ఇంటి పేరు పెట్టకపోవడమో, తండ్రి పేరు పెట్టకపోవడమో, అడ్రస్ పెట్టకపోవడమో.. చేస్తుంటారు. ఒకవేళ దొరికినా పోలీసులు సహకారం ఉంటుందనే ధీమాతో పేకాట, సట్టా..మట్కావంటి దందాలను ఆ ప్రముఖులే వెనకుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.
ఫోకస్ చేయని పోలీసులు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొన్ని ప్రాంతాల్లో రెగ్యులర్‌గా పేకాట ఆడుతారు. ప్రముఖులు, వ్యాపారవేత్తలు, గవర్నమెంట్ ఉద్యోగులు నిత్యం అక్కడ జూదంలో పాల్గొంటారు. మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని ఫ్లఓవర్ పక్కనున్న ఓ బేకరీలో పెద్దమనషులు చాలా మంది పేకాట ఆడతారు. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అక్కడ పోలీసుల రైడ్ జరగలేదు. మంచిర్యాల రెడ్డీ కాలనీలోనూ గత ఆరేడు నెలలుగా పేకాట ఆడుతున్నారు.
ఈ రోజు ఒక చోట, రేపు మరో చోట ఇలా నిత్యం లోకేషన్లు మారుస్తూ పేకాట ఆడుతున్నారు. దీంతో ఇబ్బందులు పడుతున్నామని రెడ్డీకాలనీలో కొందరు చెబుతున్నారు. ఈ విషయం పోలీసులకు చెప్పొచ్చు కదా.. అంటే అందులో ప్రముఖులు ఉంటున్నారని, ఫిర్యాదు చేస్తే తమకే ఇబ్బంది వస్తుందేమోనని చేయడం లేదని అంటున్నారు. బైపాస్ రోడ్డులోని రాళ్లపేటలోనూ ప్రభుత్వ ఉద్యోగులు, సెటిలర్లు ఉండే ఓ కాలనీలో సెలవు రోజు వచ్చిదంటే చాలు పేకాట నడుస్తున్నది.
ఈ వ్యవహారం గురించి పోలీసులకు సమాచారం లేదా& తెలిసినా కూడా మిన్నకుండి పోతున్నారా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఇక మంచిర్యాలలోని లాడ్జీలు, ప్రముఖ హోటళ్లలో పేకాట అనేది నిత్యకృత్యంగా మారిపోయింది. బెల్లంపల్లి చౌరస్తాలో ఉన్న ఓ లాడ్జిలో నిత్యం ఇలాంటి వ్యవహారమే సాగుతుంది. కానీ అదేదో ‘దివ్య’మైన కార్యం అన్నట్లు పోలీసులు పట్టించుకోరు.
జైపూర్, లక్షెట్టిపేట మండలాల్లో మామిడితోటలు, ఫామ్ హౌస్‌లు, రియల్ ఎస్టేట్ వెంచర్లలో పేకాట దందా జోరుగా సాగుతున్నది. జైపూర్ మండలంలోని ఓ గ్రామంలో మామిడి తోటలో పేకాట ఆడుతూ నిత్యం పట్టుబడుతున్నా.. దానికి అడ్డుకట్ట వేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమవుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జైపూర్ పోలీసులు ఓ మామిడి తోటలో పేకాట ఆడుతున్న కొందరిని పట్టుకున్నారు. వీరిలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉండే ఓ రాజకీయ పార్టీ అధికార ప్రతినిధి పేరును సైతం ఇలాగే గోప్యంగా ఉంచారు.
పెరుగుతున్న విష సంస్కృతి..
ప్రముఖులు, పెద్దలుగా చలమాని అవుతున్న వారి అండదండలతోనే మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో జూద సంస్కృతి ఎక్కువైపోతున్నది. గతంలో ఇలాంటి పరిస్థితి లేదని, గత కొన్ని నెలలుగా తీవ్రమైపోయిందని పోలీసు శాఖ అధికారులే చెబుతున్నారు. దాడుల్లో నిత్యం లక్షలాది రూపాయలు దొరుకుతుండడం అధికారులను విస్మయానికి గురి చేస్తున్నది. మంచిర్యాల జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 41 కేసులు నమోదు చేశారు. మొత్తం 295 మందిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.22,98,350 స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో 32 కేసులు నమోదు చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం సహా కాగజ్‌నగర్ ఏరియాల్లో అయితే నిత్యకృత్యంగా పేకాట, సట్టా..మట్కా ఆడుతున్నా నమోదు చేసే కేసులు మాత్రం నామమాత్రమని తెలుస్తున్నది.
ఎవరి పేర్లు దాచొద్దని చెప్పాం
జూదం ఆడుతూ పట్టుబడ్డ వారు ఎవరైనా సరే పేర్లు గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారులందరికీ కఠినమైన ఆదేశాలు ఇచ్చాం. ఎవరైనా సరే చట్టప్రకారం చర్యలుంటాయి. చట్టానికి ఎవరూ అతీతులు కారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో నిత్యం నిఘా పెడుతున్నాం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం. ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నాం.
– ఎం.శ్రీనివాస్, రామగుండం సీపీ