మంచిర్యాల ప్రతినిధి/మంచిర్యాల ఏసీసీ /ఆసిఫాబాద్, జనవరి 26 : మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలోని జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో కలెక్టర్ బదావత్ సంతోష్, ఆసిఫాబాద్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి వివరించారు.
జిల్లాల ప్రగతికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగానికి, పోలీస్ శాఖకు, సమాచార శాఖకు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు, అవార్డులు అందించి అభినందించారు. ఆయాచోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు దేశభక్తి గీతాలకు నృత్యాలు చేశారు. మంచిర్యాలలో స్టాళ్లు, శకటాల ప్రదర్శనలు ఆకట్టుకోగా, అధికారులు పరిశీలించారు. మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్, మోతీలాల్, డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, డీఎఫ్‌వో శివ్ ఆశీష్సింగ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, ఎస్పీ సురేశ్‌కుమార్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణు, అదనపు ఎస్పీ అచ్చేశ్వర్రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావు
పాల్గొన్నారు.