కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): వానాకాలం పంటల సాగు ముగిసి..యాసంగి పంటల సాగు ప్రారంభమవుతున్నా రైతు భరోసా పెట్టుబడి సాయం అందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు పంటలకు కలిపి ఏడాదికి ఎకరానికి రూ.15000 చొప్పున రైతు భరోసా సాయం ఇస్తామని రైతులను నమ్మించి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ చివరికి మొండి చేయి చూపించింది.
రైతు భరోసా అటుంచి కనీసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా ఎకరానికి రూ.5 వేలు అయినా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇటీవల కురిసిన ఎడతెరిపి లేని వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. పెట్టుబడులు కూడా చేతికి రాని పరిస్థితి నెలకొన్నది. మొక్కజొన్న, తదితర పంటలు కోసిన వారు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. యాసంగి సాగుకు కూడా పెట్టుబడి సాయం అందకపోవడంతో మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితి వచ్చిందని వాపోతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో అప్పులు లేని వ్యవసాయం..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 2018 నుంచి 2023 సంవత్సరం వరకు కేసీఆర్ ప్రభుత్వం జిల్లాలోని 1,37,763 మంది రైతులకు రూ.2056.64 కోట్లను అందించింది. గతేడాది 1,38,588 మంది రైతులు ఉండగా 1,31,763 మందికి రూ.420 కోట్లను రెండు పంటలకు కలిపి రూ.10వేల చొప్పున రైతుబంధు సాయం అందించింది. మంచిర్యాల జిల్లాలో 2018 నుంచి 2023 సంవత్సరం వరకు రూ.1900 కోట్లు రైతు బంధు పథకం ద్వారా అందించింది. గతేడాది 1,56,357 మంది రైతులకు రెండు పంటలకు కలిపి రూ.10 వేల చొప్పున రూ.172.11 కోట్ల రైతుబంధు పెట్టుబడి సాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం అందించింది. దీంతో పంట సాగుకు ముందే పెట్టుబడికి రైతు బంధు సాయం అందడంతో రైతులకు అప్పులు చేసే తిప్పలు తప్పాయి.
అప్పుల పాలవుతున్న రైతన్నలు
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడికి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా మారిపోయింది. వానకాలం పంట సాగు సమయంలో పెట్టుబడి సాయం అందించలేదని, యాసంగిలో కూడా రైతుబంధు ఊసెత్తడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. దీంతో రెండు పంటలకు కలిసి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రైతులపై రూ.420 కోట్లు, మంచిర్యాల జిల్లాలోని రైతులపై రూ.172.11 కోట్ల ఆర్థిక భారం పడింది. రైతులు అప్పుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధుకు మంగళం పాడినట్లే కనిపిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పుల పాలవుతున్నాం..
పంటల సాగుకు అప్పులు చేయా ల్సి వస్తోంది. నాకు 4. 5 ఎకరాల భూమి ఉంది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏడాదికి రూ.50 వేలు రైతు బంధు ద్వారా అందినయ్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా పథకాన్ని అమలు చేయకపోవడంతో పెట్టుబడికి ఇబ్బంది పడుతున్నాం. అప్పులు చేసి పంటలు సాగు చేయాల్సి వస్తున్నది. కాంగ్రెస్‌ని నమ్మినందుకు నట్టేట ముంచింది.
-రౌతు సల్మయ్య, గిరివెల్లి, దహెగాం మండలం
కాంగ్రెస్‌ను నమ్మితే నట్టేట ముంచింది..
నాకు 15 ఎకరాలు భూమి ఉంది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నాకు రైతు బంధు ద్వారా ఏడాదికి రెండు పంటలకు కలిపి లక్షా యాభై వేలు రైతు బంధు ద్వారా పెట్టుబడి సాయం అందేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వానాకాలంలో రైతు బంధు అమలు చేయలేదు. ఈ యాసంగిలోనూ అమలు చేయడం లేదు. దీంతో పంటల సాగుకు అప్పులు చేయాల్సి వస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సి వస్తున్నది.
– జర్పుల శంకర్, మరిపెల్లి గ్రామం దహెగాం