కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/ దహెగాం, మే 20 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం పూర్వ ప్రాథమిక సహకార సంఘం (పీఏసీఎస్)లో రూ. 50 లక్షలు పక్కదారి పట్టిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. సంఘం సభ్యులు పందికొక్కుల్లా నిధులు కాజేసినట్లు ఆరోపణలు రాగా, విచారణ చేపట్టిన జిల్లా సహకార సంఘం అధికారి రూ. 10 లక్షలు రికవరీ చేయడంతో పాటు మిగతా వాటి కోసం శనివారం నోటీసులు జారీ చేశారు.
దహెగాం ప్రాథమిక సహకార సంఘం ద్వారా యేటా సుమా రు 11 వేల మంది రైతులకు ప్రభుత్వం ఎరువులు సరఫరా చేస్తున్నది. సుమారు 34 వేల ఎకరాలకు ఈ సొసైటీ నుంచే ఎరువులు అందిస్తున్నారు. యేటా సీజన్లో సుమారు 300 టన్నుల ఎరువులు ఈ సొసైటీకి వస్తుండగా, రైతులకు సబ్సిడీపై విక్రయించి.. వచ్చే సొమ్మును సొసైటీలో జమ చేస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. 2020-21 నుంచి 2022-23 వరకు జరిగిన విక్రయాల్లో పెద్ద మొత్తంలో అవినీతి జరిగినట్లు తెలిసింది. రైతులకు విక్రయించిన సబ్సిడీ ఎరువులకు సంబంధించిన నిధులను సొసైటీలో సక్రమంగా జమ చేయకుండా దుర్వినియోగపరిచినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో అధికారులు కొన్ని రోజుల క్రితం అంతర్గతంగా విచారణ చేపట్టారు. ఎరువుల విక్రయాల ద్వారా వచ్చిన మొత్తం రూ. 50 లక్షలను సొసైటీలో జమచేయకుండా వాడుకున్నట్లు గుర్తించి నోటీసులు ఇచ్చారు. దీంతో రూ. 10 లక్షలను సభ్యుల నుంచి రికవరీ చేశారు. ఇంకా రూ. 40 లక్షలు రికవరీ కావాల్సి ఉంది. దాదాపు ఏడాది గడుస్తున్నా నిధులు రికవరీ కాకపోవడంతో జిల్లా సహకార సంఘం అధికారి శనివారం మరోసారి నోటీసులు జారీ చేశారు. నిధుల దుర్వినియోగంలో ఎవరెవరీ పాత్ర ఉంది, దుర్వినియోగం అయిన నిధులను ఎలా రికవరీ చేయాలనే దానిపై అధికారులు చర్యలు ప్రారంభించారు.
దహెగాం సొసైటీలో నిధుల దుర్వినియోగం వెలుగులోకి రావడంతో సభ్యుల్లో దడమొదలైంది. సొసైటీలో మొత్తం రూ. 50 లక్షలు దుర్వినియోగం కాగా, గతంలో రూ. 10 లక్షలు రికవరీ అయ్యాయి. మిగతా రూ. 40 లక్షల్లో ఎవరు ఎన్ని డబ్బులు తిన్నారు, ఎవరెవరు ఎంత రికవరీ చేయాలనే దానిపై సహకార సంఘం సభ్యులు, అధికారులు చర్చించినట్లు తెలసింది. ఎవవరు ఎంత కట్టాలన్న దానిపై తీర్మానాలు కూడా చేసుకున్నట్లు సమాచారం. ఇక ఇదిలా ఉంటే దుర్వినియోగమైన నిధులు ఎవరెన్ని వాడుకున్నారు, ఎవరి నుంచి ఎంతెంతీ రికవరీ చేయాలన్న అంశంపై తీర్మానాలు చేసిన పత్రాలు కూడా సొసైటీ కార్యాలయం నుంచి మాయమైనట్లు తెలిసింది.
దహెగాం పీఎసీఎస్లో జరిగిన నిధుల దుర్వినియోగం గురించి సొసైటీకి నోటీసులు జారీ చేశాం. మొత్తం రూ. 50 లక్షలు దుర్వినియోగం అయ్యాయి. ఇందులో రూ. 10 లక్షలు రికవరీ చేశాం. ఇంకా రూ. 40 లక్షలు రికవరీ కావాల్సి ఉంది. ఈ సంఘం ద్వారా రైతులకు సబ్సిడీ ద్వారా ఎరువులను విక్రయించాలి. వచ్చిన డబ్బులను సొసైటీలో జమచేయాలి. ఎరువులు అమ్మగా వచ్చిన మార్జిన్ డబ్బులను వేతనాలుగా, ఇతర ఖర్చులకు వినియోగించుకోవాలి. కానీ, ఈ సొసైటీలో ఎరువులు విక్రయించగా వచ్చిన డబ్బులను నేరుగా వాడుకున్నారు. ఈ నిధుల రికవరీ కోసం శనివారం నోటీసులు జారీ చేశాం.