మంచిర్యాలటౌన్/నెన్నెల, మే 31 : ‘అబ్బ.. అగ్గి కురుస్తున్నట్లుంది.. వశమైతలేదు..’ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇవే మాటలు. జిల్లాలో శుక్రవారం భానుడు గంట గంటకూ ఉగ్రరూపం దాల్చగా, ప్రజానీకం అల్లాడిపోయింది. ఉదయం లేచిన దగ్గరనుంచి సూర్యుడు నిప్పులు కక్కుతూనే ఉన్నాడు.
రాష్ట్రంలో నే అత్యధికంగా భీమారంలో47.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలిగించింది. ఎండకు తోడు వేడి గాలులు వీయగా, ప్రజలు ఉక్కపోతతో తల్లడిల్లారు. మధ్యాహ్నం జన సంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మూగజీవాలు చెట్ల నీడన చేరి సేద తీరాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వరుణ దేవుడు కరుణించాలని ప్రజలంతా ప్రార్థిస్తున్నారు.