నిర్మల్ చైన్‌గేట్, ఏప్రిల్ 11 : అడవిలో తునికాకు సేకరణకు వెళ్లి దారి తప్పిపోయి నలుగురు మహిళలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. కారడవిలో నలుగురు మహిళలు దారితప్పి తప్పిపోగా జిల్లా పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మహిళల ఆచూకీ కనుగొనడంతో ఉత్కంఠకు తెరపడింది. వివరాల్లో కెళ్తే నిర్మల్ జిల్లా మామడ మండలం కప్పనపల్లికి చెందిన నలుగురు మహిళలు రాజుల రాధ, కంబాల లింగవ్వ, గట్లమీది లక్ష్మి, బత్తుల సరోజ తునికాకు సేకరణకు గ్రామ శివారులోని దట్టమైన అడవికి గురువారం సాయంత్రం వెళ్లారు. చీకటి పడడంతో దారి తప్పిపోయారు.
మహిళలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గ్రామస్తుల సాయంతో అడవిలో ఎంత వెతికినా జాడ దొరకలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ డా.జానకీషర్మిల, ఏఎస్పీ రాజేశ్మీనాతో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు ఆరు గంటల పాటు పోలీసులు అడవిని జల్లెడ పట్టారు. ఇద్దరి మహిళల వద్ద సెల్ఫోన్లు ఉన్నప్పటికీ నెట్వర్క్ సిగ్నల్ లేదు.
అర్ధరాత్రి తర్వాత ఓ ఫోన్‌కు సిగ్నల్ రావడంతో దాని ఆధారంగా ట్రాకింగ్ చేసి, డ్రోన్ కెమెరాలతో గాలించారు. చివరికీ భీమన్న గుట్టపై మహిళల ఆచూకీని గుర్తించారు. వారిని శుక్రవారం ఉదయం పోలీసులు సురక్షితంగా గ్రామానికి తీసుకువచ్చారు. జిల్లా ఎస్పీ, అధికారులు, సిబ్బందిపై గ్రామస్తులు పూలు చల్లుతూ అభినందిస్తూ గ్రామంలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామస్తులు అటవీ ప్రాంతాలకు వెళ్లే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఆపద సమయాల్లో పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ ఆపరేషన్‌లో ఎస్పీ జానకీ షర్మిలతో పాటు ఏఎస్పీ రాజేశ్‌మీనా, ఇన్స్పెక్టర్లు గోవర్దన్‌రెడ్డి, ఆర్ఐలు శేఖర్, రమేశ్, ఎస్ఐలు ఆర్ఏసీలు, ఉమెన్ స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.