నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులతో సమీక్ష
జిల్లా దవాఖాన భవన నిర్మాణ స్థలం పరిశీలన
నిర్మల్ చైన్‌గేట్, ఫిబ్రవరి 28 : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఈ నెల 3న నిర్మల్ జిల్లాకు రానున్న నేపథ్యంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం బాసరలోని జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపారు. అనంతరం ముథోల్‌లోని 30 పడకల దవాఖాన, నిర్మల్ పట్టణంలో 250 పడకల దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు.
నిర్మాణ స్థలం పరిశీలన..
నిర్మల్ పట్టణంలోని దివ్యనగర్ మల్లనగుట్ట ప్రాంతంలో రూ.41 కోట్లతో నిర్మిస్తున్న జిల్లా దవాఖాన భవన నిర్మాణ స్థలాన్ని సోమవారం కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పరిశీలించారు. జిల్లా దవాఖాన పక్కనే వైద్య కళాశాల నిర్మించేందుకు స్థలాన్ని పరిశీలించారు. ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్, జిల్లా ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్ దేవేందర్‌రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, ఆర్డీవో రమేశ్ రాథోడ్, పలు శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.
ముథోల్‌లో విఠల్ రెడ్డి స్థల పరిశీలన..
ముథోల్, ఫిబ్రవరి 28 : ముథోల్ దవాఖాన వైద్య విధాన పరిషత్గా అప్‌గ్రేడ్ కావడంతో రూ.8 కోట్లతో నూతన దవాఖాన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు మంత్రి టీ హరీశ్‌రావు వస్తున్న నేపథ్యంలో స్థలాన్ని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట ముథోల్ సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, డీఈఈ కమలాకర్, నాయకులు సురేందర్ రెడ్డి, అఫ్రోజ్ ఖాన్, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఖాలీద్, వార్డు సభ్యులు చిన్న గంగాధర్, సంజీవ్ కుమార్ పాల్గొన్నారు.