మంచిర్యాల టౌన్, డిసెంబర్ 29 : జనవరి 28 నుంచి జరుగబోయే మేడారం జాతరకు ఆర్టీసీ అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నట్లు కరీంనగర్ ఈడీ పీ సోలోమన్ పేర్కొన్నారు. సోమవారం మంచిర్యాల ఆర్టీసీ డిపోలో ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని డిపోల మేనేజర్లు, ట్రాఫిక్, గ్యారేజీ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో జాతర సమయంలో ఏయే ప్రాంతాల నుంచి ఎన్నెన్ని బస్సులు నడిపామో, అప్పుడు ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా అన్న అంశాలపై ఆయన చర్చించారు. భక్తులకు మేడారం జాతర వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖవంతమైన ప్రయాణాన్ని అందించడం కోసం అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఈడీ సోలోమన్ సూచించారు.
ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని డిపోల నుంచి మొత్తం 369 బస్సులను నడుపాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇందులో చెన్నూరు బస్టాండు నుంచి 70, బెల్లంపల్లి నుంచి 89, శ్రీరాంపూర్ నుంచి 45, మందమర్రి నుంచి 50, మంచిర్యాల నుంచి 115 బస్సులను మేడారం జాతరకు నడుపుతున్నట్లు ప్రకటించారు. మహిళలకు మహాలక్ష్మీ పథకం వర్తిస్తుందని తెలిపారు. జాతరకు వెళ్లే ప్రయాణికులను సురక్షితంగా, సుఖవంతంగా చేర్చడమే సంస్థ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం అధికారులు, సిబ్బంది అంతా జాతర జరిగే రోజుల్లో నిరంతరం పనిచేయాల్సి ఉంటుందన్నారు.
అనంతరం జాతర కోసం బస్సులను నడిపించే శ్రీరాంపూర్, చెన్నూరు పాయింట్లను అధికారులు పరిశీలించారు. అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఈ అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్ భవానిప్రసాద్, డిప్యూటీ ఆర్ఎం హర్ష, మంచిర్యాల డీఎం శ్రీనివాసులు, నిర్మల్ డీఎం పండరి, ఆసిఫాబాద్ డీఎం రాజశేఖర్, భైంసా డీఎం హరిప్రసాద్, ఆదిలాబాద్ డీఎం ప్రతిమరెడ్డి, అన్ని డిపోల ట్రాఫిక్, గ్యారేజ్ ఇన్చార్జిలు పాల్గొన్నారు.