ఆదిలాబాద్ జిల్లాలో చాలా వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే వంతెనల వద్ద కూడా వాగులు, వంకలు మలుపులు సూచించే సూచీ బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వందల సంవత్సరాల క్రితం నిర్మించిన వంతెనలకు సేఫ్టీ పిల్లర్లు, సైడ్‌వాల్స్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ గ్రామంలో ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి బస్సు వాగులోకి దూసుకెళ్లిన ఘటనలో ఏకంగా 30 మందికి పైగా గాయాలయ్యాయి. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు మళ్లీ కనిపించడం లేదు.
– ఉట్నూర్, మార్చి 10
ఆదిలాబాద్ జిల్లాలో హైవేల పై వంతెనలకు సెప్టీ పిల్లర్లు కనిపించవు. ముఖ్యంగా గుడిహత్నూర్ నుంచి ఉట్నూర్ డివిజన్ కేంద్రం వరకు ఉన్న వంతెనలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. నిత్యం వందలాది భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు పరిమితికి మించి ప్రయాణిస్తున్నప్పటికీ అధికారులు కనీస వసతులు కల్పించడం లేదు. ఇటీవల శ్యాంపూర్‌లో జరిగిన వంతెన ప్రమాదం సెప్టి పిల్లర్లు ఉండి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదు. అదే నాగాపూర్ వంతెనపై నుంచి పడి ఉంటే అందులో నిండుగా నీరు ఉండడంతో చాలా మంది ప్రయాణికులు ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయేవారు. ఇలాంటి నిర్లక్ష్యంపు పనులు ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. ఇక ఆర్అండ్బీ శాఖ వంతెనల వద్ద సూచికలు బోర్డులు కూడ ఏర్పాటుచేయకపోవడం దారుణమని వాహన దారులు వాపోతున్నారు.
గతంలో ఉట్నూర్ మండలంలోని నాగాపూర్ వంతెనపై నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలు అంతరాయం కలిగింది. ప్రమాదం పొంచి ఉండడంతో రూ.4 కోట్లతో టెండర్లు నిర్వహించారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని పలు పురాతన వంతెనలకు అధికారులు టెండర్లు నిర్వహించారు. అయితే వాటిని దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు నిర్వహించేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు చేయడానికి ముందుకు రావడం లేదని సమాచారం.
నేను ఐటీడీఏ ద్వారా వాహనం తీసుకొని డ్రైవర్ కం ఓనర్‌గా జీవనం సాగిస్తున్నా. నిత్యం చాలా రూట్లలో వాహనాన్ని నడుపుతుంటా. అయితే ఆదిలాబాద్ నుంచి ఉట్నూర్‌కు వస్తున్నప్పుడు చాలా పురాతన వంతెనలు ఉన్నాయి. చాలా కాలం క్రితం కట్టినవి. వాటికి కనీసం ఆర్అండ్బీ అధికారులు వంతెనలున్నాయని, మూలమలుపులు ఉన్నాయని ప్రమాద సూచీ తెలిపే బోర్డులే ఏర్పాటు చేయలేదు. వంతెనలకు సైడ్ వాల్స్ లేవు. నాగాపూర్ వాగులో ఇంతకు ముందు వేరే రాష్ట్రం నుంచి లోడుతో వచ్చిన లారీ పడిపోతే క్లీనర్ చనిపోయాడు. అందులో పూర్తిగా నిండిన వాటర్ ఉంటాయి. కనీసం దానికి సైడ్‌వాల్స్ కూడా లేవు. ఎదురుగా వాహనం వస్తే వంతెన దాటేదాక ఆగాల్సిందే. అదికాక వర్షాకాలం వంతెనలపై నుంచి వాటర్ పారుతూ రాకపోకలు ఆగిపోతాయి. అయిన అధికారులు స్పందించడం లేదు. కొత్త వంతెనలు కట్టి ప్రమాదాలు అరికట్టాలి.
– నళిని వెంకటరమణ, ప్రైవేట్ డ్రైవర్, ఉట్నూర్