
నవంబర్ 8వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
కలెక్టర్ల అధ్యక్షతన ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో అధికారులు, రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు
అడవుల సంరక్షణపై ప్రతిజ్ఞ
ఆదిలాబాద్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నిర్మల్ టౌన్, అక్టోబర్ 30 : పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా పరిషత్ సమావేశ మందిరాల్లో కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ముషారఫ్ అలీ ఫారూఖీ అధ్యక్షతన అటవీ సంరక్షణ, అటవీహక్కు గుర్తింపు చట్టం, పోడుభూముల సమస్యపై సమావేశం నిర్వహించారు. మంత్రితో పాటు జడ్పీ చైర్మన్లు జనార్దన్ రాథోడ్, విజయలక్ష్మి, ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, ముథోల్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్, రేఖానాయక్, విఠల్‌రెడ్డి, సీఎఫ్ రాజలింగం, ఐటీడీఏ పీవో అంకిత్, వివిధ పార్టీల నాయకులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ అర్హులందరికీ పట్టాలు అందిస్తామని, ఈ మేరకు నవంబర్ 8వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు సలహాలు, సూచనలు అందజేశారు.
భవిష్యత్ తరాలు బాగుండాలంటే అడవులు నరికివేతకు గురికాకుండా చూడాలని, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, పచ్చదనాన్ని పెంపొందించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా పరిషత్ సమావేశ మందిరాల్లో కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ముషారఫ్ అలీ ఫారూఖీ అధ్యక్షతన అటవీ సంరక్షణ, అటవీహక్కు గుర్తింపు చట్టం, పోడుభూముల సమస్యపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలో 10.26 లక్షల ఎకరాలు భూమి ఉండగా.. 4.47 లక్షల ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో 1,47,593 ఎకరాల్లో ఆక్రమణకు గురికాగా.. 69,654 ఎకరాలకు గతంలో హక్కు పత్రాలు మంజూరు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారని తెలిపారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహించారన్నారు. అర్హులందరికీ హక్కులు కల్పించడంతో పాటు అడవులను సంరక్షించడానికి విపక్ష నాయకుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అటవీభూములు సాగు చేస్తున్న వారి వద్ద నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో అటవీహక్కుల కమిటీలో క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామసభల ద్వారా అర్హులను గుర్తిస్తుందన్నారు. భూములు సాగు చేస్తున్న వారికి పట్టాలు అందడంతో పాటు భవిష్యత్‌లో అడవి నరికివేతకు గురికాకుండా స్థానిక, వివిధ పార్టీల నాయకులు, గిరిజన సంఘాలు సహకారం అందించాలని కోరారు. భూముల పంపిణీ పూర్తయిన తర్వాత అటవీశాఖ అధికారులు అడవుల చుట్టూ కందకాలు తవ్వి సంరక్షణ చర్యలు తీసుకుంటారని తెలిపారు. అడవుల సంరక్షణలో భాగంగా సమావేశానికి హాజరైన వారితో అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. సభ్యుల సలహాలు, సూచనలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోతానని మంత్రి తెలిపారు. ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, ఆధికారులు హాజరయ్యారు.
నిర్మల్ జిల్లాలో 19,543 ఎకరాల్లో అడవి ఆక్రమణ..
ఉమ్మడి జిల్లాలో మూడు దశాబ్దాలుగా పోడు సాగు చేసుకుంటున్న రైతులందరికీ సర్వే నిర్వహించి పక్కాగా పట్టాలందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అల్లోల అధికారులను ఆదేశించారు. 2005కు ముందు ఆర్వోఎఫ్ఆర్ కింద పట్టాలిచ్చిన భూములతో పాటు ఇటీవల కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు సాగు పెరిగినట్లు జిల్లా అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో 19,543 ఎకరాల్లో అడవి ఆక్రమణకు గురైందని తెలిపారు. ముఖ్యంగా ఖానాపూర్, ముథోల్, సారంగాపూర్, కుభీర్ మండలాల్లో ఎక్కువగా భూమి ఆక్రమణకు గురైనందున అన్ని రాజకీయ పార్టీల నేతలతో చర్చించి అర్హులను గుర్తించేందుకు జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీలు మూడు తరాలుగా సాగు చేసుకుంటున్న వారి వివరాలు తెలుపుతుందని గుర్తు చేశారు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ముందుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని రాజకీయ నాయకులు, అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, డీఎఫ్‌వో వికాస్‌మీనా, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, డీసీఎంఎస్ చైర్మన్ లింగయ్య, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు గండ్రత్ ఈశ్వర్, రాజేందర్, జిల్లా అధికారులు రమేశ్‌కుమార్, శంకరయ్య, సుధీర్‌కుమార్, రాజకీయ పార్టీల నాయకులు రాజన్న, నూతన్‌కుమార్, రాజు, విలాస్, శంకర్, రమేశ్, ఉపలి, టీఆర్ఎస్ నాయకులు రాంకిషన్‌రెడ్డి, బాశెట్టి రాజన్న, రామేశ్వర్‌రెడ్డి, జీవన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
పక్కాగా సర్వే నిర్వహించాలి..
ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి, దస్తురాబాద్, కడెం, ఖానాపూర్ మండలాల్లో పెద్ద ఎత్తున పోడు వ్యవసాయం చేస్తున్నారు. ఏళ్ల తరబడి భూమి పట్టాలు రాక రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ముఖ్యమంత్రి హామీనిచ్చి దాన్ని నెరవేర్చేందుకు తీసుకున్న నిర్ణయం అభినందనీయం. పక్కాగా సర్వే చేసి అర్హులకు పట్టాలు అందించేందుకు అధికారులు కృషి చేయాలి. – రేఖానాయక్, ఖానాపూర్ ఎమ్మెల్యే