
మంచిర్యాలటౌన్, అక్టోబర్ 30: కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లలో మినరల్ వాటర్ ఏర్పాటు చేసినందుకు అయిన ఖర్చు రూ. 28,500లు బిల్లు చెల్లించే విషయంపై మున్సిపల్ సమావేశంలో రభస నెలకొంది. శనివారం మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్మన్ పెంట రాజయ్య అధ్యక్షతన జరిగింది. కొవిద్ వ్యాక్సినేషన్ సెంటర్లలో మినరల్ వాటర్ క్యాన్లను ఏర్పాటుచేసినందుకు అయిన మొత్తాన్ని చెల్లించడం కోసం కౌన్సిల్ ఎజెండాలో పొందుపరిచారు. దీనిపై కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పలయ్య కలుగజేసుకుని మున్సిపాలిటీ ద్వారా అందించే తాగునీరు ఉండ గా మినరల్ వాటర్ ఎందుకు వాడారనిప్రశ్నించారు. అలా వాడడం వల్ల మున్సిపాలిటీ ద్వారా అందించే నీళ్లు మంచివి కావు అనే సందేశం ప్రజల్లోకి వెళ్తుందని తెలిపారు. ఈ విషయంపై టీఆర్ఎస్ కౌన్సిలర్లు గాదెసత్యం, హరికృష్ణ కలుగజేసుకుని మున్సిపల్ సరఫరా చేస్తున్న నీరు సరైనది కాదని అనడం సరికాదని, వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. మున్సిపాలిటీకి చెందిన నాలుగు వాహనాలు చెడిపోయి పక్కన ఉన్నందున తుక్కుకింద వేలం వేయడాన్ని రద్దుచేసి తిరిగి నిర్వహించాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది. పలు ప్రాంతాల్లో 75 సీసీ కెమెరాలను ఏర్పాటు కోసం రూ. 14.86 లక్షలను చెల్లించాలని ఏసీపీ అఖిల్ మహాజన్ లేఖ ద్వారా కోరగా కౌన్సిల్ ఆమోదించింది. కౌన్సిలర్ వేములపల్లి సంజీవ్ మాట్లాడుతూ అన్ని వార్డుల్లో 10 సీసీ కెమెరాలు చొప్పున ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించాలని చైర్మన్‌ను కోరారు. ఐదోవార్డు కౌన్సిలర్ సుదమల్ల హరికృష్ణ మాట్లాడుతూ సాయికుంట ఏరియాలో ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తే స్థానికులతో పాటు ఎస్సీ హాస్టల్ విద్యార్థులు దుర్వాసనతో ఇబ్బంది పడుతారని తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని పలు ప్రాంతాలలో రోడ్లు, జంక్షన్ల అభివృద్ధికి టోటల్ స్టేషన్‌తో సర్వే చేసేందుకు కౌన్సిల్ పరిపాలనా ఆమోదం లభించింది. కాగా మూడోవార్డు కౌన్సిలర్ మాజిద్ మాట్లాడుతూ టూటౌన్ ప్రాంతంలో మరిన్ని జంక్షన్లు అభివృద్ధి చేయాలని కోరారు. మెయిన్ బజార్ ఏరియా, కాలేజీరోడ్ జంక్షన్లను అభివృద్ధి చేయాలని కౌన్సిలర్ మాదంశెట్టి సత్యానారాయణ, కౌన్సిలర్ సురేశ్ బల్దవా కోరారు. సర్వే చేసేందుకు తన వార్డును ఎంపిక చేసినందుకు, బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించినందుకు కౌన్సిలర్ మహేశ్వరి ఎమ్మెల్యే, చైర్మన్, కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమర్మియా సొసైటీలో భూ అక్రమాలకు పాల్పడిన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ మినాజ్ కోరారు. నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ ముఖేశ్‌గౌడ్, మున్సిపల్ ఇంజినీర్ మధూకర్, ఏఈ నర్సింహాస్వామి, టీపీఎస్ సత్యనారాయణ, ఆర్వో శ్రీనివాస్‌రెడ్డి, జేఏవో అనితాదేవి, ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్‌రాథోడ్, టీవో మధు ఉన్నారు.