
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 30: పట్టణ ప్రజలకు రూపాయికే నల్లా కనెక్షన్‌తో మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. పట్టణాభివృద్ధే ధ్యేయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ముందకెళ్లాలని సూచించారు. జిల్లా కేంద్రంలో చేపడుతున్న పట్టణ సుందరీకరణ పనులతో పట్టణానికి నగర శోభ సంతరించుకుందన్నారు.జిల్లా కేంద్రంలో సమీకృత మార్కెట్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అన్ని రకాల కూరగాయలు, పండ్లు, మాంసం, కిరాణా దుకాణాలను ఒకే చోట సమకూర్చడంతో ఇబ్బందులు దూరం కానున్నాయని తెలిపారు. సమీకృత మార్కెట్ నిర్మాణం పూర్తయితే రోడ్లపై తోపుడు బండ్లు ట్రాఫిక్ సమస్యలు దూరమవుతాయన్నారు. రోడ్డు వెడల్పు పనులు త్వరలో పూర్తి చేయిస్తామన్నారు. పట్టణ ప్రగతిలో ప్రతి వార్డుకు రూ.25 లక్షలు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. పురాతన కట్టడ్డాలను అభివృద్ధిపర్చి పట్టణాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో డంప్ యార్డును నిర్మించామని, రూ.2కోట్ల 75 లక్షలతో మోడల్ వైకుంఠధామ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి ఆలయంలో భాగస్వాములుకండి
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 30: యాదాద్రి ఆలయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని 2022 మార్చి 28న ప్రారంభించనున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ రూ.11 విరాళంగా ఇవ్వాలని సూచించారు. శనివారం నిర్మల్ పట్టణంలోని గాంధీగర్లో రూ.15 లక్షలతో నిర్మించనున్న హింగుళాంబికాదేవి ఆలయ శిలాఫకల ప్రారంభోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరు కాగా వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాల్లోనే ప్రశాంతత, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని తెలిపారు. 40 ఏండ్ల పురాతన ఆలయాన్ని అద్భుతంగా నిర్మించుకున్నామన్నారు. ఉదాసీ మఠానికి నిధులు మంజూరు చేసామని చెప్పారు. నిర్మల్ జిల్లాలో 600 ఆలయాలను అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మంత్రిని భవసార్ క్షత్రియులు సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు నేరెళ్ల వేణు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు లోలం శ్యాంసుందర్ డీ శ్రీనివాస్, ముడుసు సత్యనారాయణ, ఆలయ ఇన్స్పెక్టర్ రంగు రవికిషన్ తదితరులున్నారు.