
తలమడుగు, అక్టోబర్ 30 : అందరి సహకారంతోనే గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తయిందని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం మండలంలోని ఉమ్రి గ్రామంలో మహారాష్ట్ర బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కాడే స్వామి ఆధ్వర్యంలో మండలంలో కరోనా కాలంలో సేవలందించినవారికి వైద్య , మీడియా సిబ్బంది ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామస్తులు గుస్సాడి నృత్యాలతో కలెక్టర్‌కు ఘన స్వాగతం పలికారు. కుమ్రంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొవిడ్ విధులు నిర్వహించిన మండలంలోని ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, మండల వైద్యాధికారులతో పాటు వైద్య సిబ్బందిని కలెక్టర్ శాలువాలతో సత్కరించారు. ఉమ్రిలో వంద శాతం కొవిడ్ వాక్సినేషన్ పూర్తి అయిన సందర్భంగా గ్రామ పటేల్, సర్పంచ్, ఎంపీటీసీలను సన్మానించారు. గ్రామస్తులు కలెక్టర్‌తో పాటు జిల్లా ఉన్నాతాధికారులను సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడూతూ కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బంది అందించిన సేవలు మరువలేనివన్నారు. అర్హులందరూ కొవిడ్ టీకాను తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు. దీని కోసం ప్రతి గ్రామంలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆత్మీయ సన్మాన సమావేశాన్ని ఏర్పాటు చేసిన కాడే స్వామిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, సర్పంచ్ గోపాల్, పటేల్ రామారావు, మాధవ్‌రావు, కాడేస్వామి, రిమ్స్ ఆర్ఎంవో చందు, జిల్లా అదనపు వైద్యాధికారి సాధన, తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, ఎంపీడీవో రమాకాంత్, వైద్య సిబ్బంది, యువజన సంఘాల సభ్యులు, ఆయా శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.