
బంగారుగూడలో ఫీకల్స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ప్రారంభం
రూ.2.56 కోట్లతో నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం
పర్యావరణ పరిరక్షణకు బహుళ ప్రయోజనాలు
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 30 :పచ్చదనం.. పరిశుభ్రతకు నడుంబిగించిన రాష్ట్ర సర్కారు, పర్యావరణ రక్షణకు సంకల్పిం చింది. మానవ వ్యర్థాలతో ఎరువు తయారీ చేయాలని నిర్ణయించింది. ఇటీవలే ఆదిలాబాద్ పట్టణంలోని బంగారుగూడలో రూ.2.56 కోట్లతో ఫీకల్స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎఫ్ఎస్టీపీ)ను ఏర్పాటు చేయగా, ఇటీవల ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ సిక్తాపట్నాయక్ ప్రారంభించారు. ఇటు వ్యర్థాల శుద్ధి.. అటు ఎరువుల వృద్ధితో బహుళ ప్రయోజనాలు కలుగనున్నవి. గతంలో సేకరించిన వ్యర్థాలను ఊరి శివారు ప్రాంతాల్లో పడవేస్తే దుర్గంధం వెదజల్లి, ప్రజలు రోగాల బారిన పడేవారు. ప్లాంటు నిర్మాణంతో వ్యర్థాలు శుద్ధి అవడంతోపాటు మున్సిపాలిటీకి ఆదాయం సమకూరనుంది.
స్వచ్ఛ తెలంగాణలో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగం బాగా పెరిగింది. అదేస్థాయిలో మానవ వ్యర్థాలు కూడా పేరుకుపోతున్నాయి. సెప్టిక్ ట్యాంకులు నిండితే ప్రైవేట్ ట్యాంకర్లు వచ్చి వ్యర్థాలను సేకరించి శివారు ప్రాంతాల్లో పారవేయడం, గుంత తీసి పూడ్చడం జరుగుతున్నది. దీంతో వాయు, నీటి, భూ కాలుష్యంతో పర్యావరణానికి విఘాతం కలుగడంపాటు, వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. మున్సిపాలిటీల్లో మానవ వ్యర్థాలను శుద్ధి చేసి సేంద్రియ ఎరువులను తయారు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బంగారుగూడలో రూ.2.56 కోట్లతో రోజుకు 35 వేల కిలో లీటర్ల మానవ వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంటు(ఎఫ్ఎస్టీపీ) నిర్మించారు. దీనిని తాజాగా ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఆదిలాబాద్ పట్టణంలో రోజుకు 20వేల కిలోలీటర్ల వ్యర్థాలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకేసారి మూడు రోజులకు సంబంధించిన స్లడ్జ్ను నిల్వ ఉంచే సామర్థ్యం గల ప్లాంటు కూడా ఉంది.
పనితీరు ఇలా..
ఆదిలాబాద్ పట్టణంలో మానవ వ్యర్థాలను సేకరించే వారు కొందరు ఉన్నారు. వీరు సేకరించిన వ్యర్థాలను ఊరి శివారు ప్రాంతాల్లో వేసేవారు. ఇటువంటి పది మందిని గుర్తించి మున్సిపాలిటీ వారు ప్రత్యేకంగా లైసెన్స్లు జారీ చేశారు. వీరు రోజూ పట్టణంలో పేరుకుపోయిన వ్యర్థాలను సేకరించి శివారు ప్రాంతాలకు బదులు బంగారుగూడలోని ఎఫ్ఎస్టీపీలోని కుండీలో వేయాలి. లేకపోతే జరిమానా విధిస్తామని అధికారులు హుకుం జారీ చేశారు. కుండీలో మల వ్యర్థం, నీరు వేర్వేరు అవుతాయి. ప్రత్యేకంగా నిర్మించిన చిన్న చిన్న గదుల ద్వారా వివిధ దశల్లో వడపోత జరుగుతుంది. సేంద్రియ ఎరువు కార్బన్ ఫిల్టర్లోకి, శుద్ధి తర్వాత నీరు ట్యాంకులోకి చేరుతుంది. ఈ క్రమంలో నీరు, ఘన పదార్థాలుగా వేరవుతాయి. ఘన పదార్థాలను శుద్ధి చేసి పొడిగా మారుస్తారు. ఇది పంట పొలాలకు ఎంతో మేలు కలిగించే ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. శుద్ధి తర్వాత నీటిని మొక్కల పెంపకానికి, కూరగాయల సాగుకు వినియోగించుకోవచ్చు.
పర్యావరణ రక్షణ కోసమే..
ఆదిలాబాద్ పట్టణ ప్రజల ఆరోగ్యాలను కాపాడాలనే ఉద్దేశంతోనే ప్లాంట్ను ఏర్పాటు చేశాం. గతంలో సేకరించిన మానవ వ్యర్థాలను పట్టణ శివారు ప్రాంతాల్లో వేయడం వల్ల దుర్గంధంతోపాటు ప్రజలు అనారోగ్యాల బారిన పడేవారు. అందుకే రూ.2.56 కోట్లతో ప్లాంట్ను ఏర్పాటు చేసి ఎరువుల తయారీని చేపడుతున్నాం.