
సాయిదీక్షా సేవా సమితి కార్యక్రమాలు అభినందనీయం
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
గండి రామన్న ఆలయం నుంచి కదిలి పాపహరేశ్వర ఆలయానికి పాదయాత్ర
ప్రారంభించిన అల్లోల
నిర్మల్ అర్బన్, ఆగస్టు 30 : ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సాయిదీక్షా సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని గండి రామన్న దత్తసాయి ఆలయం నుంచి కదిలి పాపహరేశ్వర ఆలయం వద్దకు నిర్వహించిన పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ముందుగా ఆలయానికి వచ్చిన మంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో సాయిదీక్షా సేవా సమితి అనేక ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు. ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని, సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. నిర్మల్ నుంచి కదిలి వరకు పాదయాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాయిదీక్షా సేవా సమితి అధ్యక్షుడు లక్కాడి జగన్మోహన్ రెడ్డి, కాళేశ్వర ఆలయ చైర్మన్ కొరిపెల్లి దేవేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు పూదరి నరహరి, శ్రీనివాస్, లక్కాడి జైపాల్ రెడ్డి సాయిదీక్షా సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
కదిలికి చేరిన పాదయాత్ర..
దిలావర్పూర్, ఆగస్ట్ 30 : నిర్మల్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర మండలంలోని కదిలి పాపహరేశ్వర ఆలయానికి సాయంత్రానికి చేరుకున్నది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో భక్తులు ఘన స్వాగతం పలికారు. ఆలయం వద్ద ఆలయ చైర్మన్ భుజంగ్‌రావు పటేల్, పండితులు స్వాగ తం పలికారు. అనంతరం సాయిదీక్షా సేవా సమి తి సభ్యులు ఆలయంలో అభిషేకం నిర్వహించి, మాత అన్నపూర్ణ దేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాదయాత్రగా వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ సంబాజీపటేల్, సప్పల రవి, ధర్మకర్తలు, పండితులు పాల్గొన్నారు.