
మహిళా సంఘాలకు ప్రోత్సాహక నిధి
ఉమ్మడి జిల్లాలో రూ. 3.70 కోట్ల రివాల్వింగ్ ఫండ్
నిర్మల్ చైన్‌గేట్, నవంబర్ 29 : మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నది. ఇందు లో భాగంగా స్వయం సహాయక సంఘాల్లో లేని మహిళలు, ఏళ్ల తరబడి అవకాశం కోసం నిరీక్షిస్తున్న వారిని గుర్తించి వారితో సంఘాలను ఏర్పాటు చేస్తున్నది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ప్రతినెలా పొదుపు చేస్తూ బ్యాంకు లింకేజీ రుణాలు తీసుకొని ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. కొత్తగా చేరిన మహిళా సంఘాలకు ప్రోత్సాహకంగా రూ. 15 వేలు చొప్పున రివాల్వింగ్ ఫండ్ అంజేస్తున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2472 సంఘాలకు రూ. 15 వేలు చొప్పున రూ. 3,70,80,000 రివాల్వింగ్ ఫండ్ జమ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 739 సంఘాలకు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 391 సంఘాలకు, మంచిర్యాల-497 సంఘాలకు, నిర్మల్ -845 సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ జమచేసింది.
ఓటరు గుర్తింపు కార్డు ఆధారంగా..
ఓటరు జాబితా ఆధారంగా 18 ఏళ్లు నిండిన మహిళల ను గుర్తించి కొత్త సంఘాలు ఏర్పాటు చేస్తారు. ప్రతినెలా పొదుపు ప్రారంభించిన నాటి నుంచి ఆరునెలల తర్వాత మాత్రమే వారిని బ్యాంకు లింకేజీకి అర్హులుగా గుర్తిస్తారు. ప్రభుత్వం కొత్త సంఘాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సంఘాలకు రివాల్వింగ్ ఫండ్‌ను గ్రాంటుగా ఇస్తున్నది. ఈ గ్రాంటును సభ్యులు అప్పుగా తీసుకొని తిరిగి చెల్లిస్తారు.
కొత్త సంఘాలకు ప్రోత్సాహం
నిర్మల్ జిల్లాలో కొత్తగా ఏర్పాటైన సంఘాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పాటు వారు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ అందజేస్తున్నది. సంఘాలుఈ గ్రాంటును అప్పు గా తీసుకొని ప్రతినెలా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఆరు నెలలు దాటిన కొత్త సంఘాలు ఈ రివాల్వింగ్ ఫండ్ గ్రాంటుకు అర్హత కలిగి ఉంటారు. మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి.