
ఇచ్చోడ, అక్టోబర్ 29 : మండలంలోని గుండాల గ్రామంలో ఇటీవల ఉర్సులో భాగంగా జరిగిన ఘర్షణలో ఇద్దర్ని హత్య చేసిన 12 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ దంద్ర తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గుండాల గ్రామ ఎంపీటీసీ భర్త ముబిన్, సర్పం చ్ భర్త అబ్దుల్ రషీద్ మధ్య కొన్నేళ్లుగా రాజకీయ కక్షలు కొనసాగుతున్నాయి. ఈ 27న గ్రామంలో ఉర్సు నిర్వహిస్తామని సర్పంచ్ వర్గం అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకోగా, అనుమతులు ఇవ్వలేదు. నిబంధనలు అతిక్రమించి డీజే తో, ర్యాలీ తీశారు. దీంతో ఎంపీటీసీ వర్గం వారు అడ్డుకోవడం తో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో సర్పంచ్ వర్గం వారు ప్రత్యర్థి వర్గం అనుచరులపై కత్తులు, గొడ్డళ్లు, కర్రలతో దాడులు చేయగా అన్నదమ్ములైన షేక్ జైరొద్దీన్ (60) షేక్ ఝా హ (55) అక్కడికక్కడే మృతి చెందగా, షేక్ సిరాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వెంటనే క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా గాయపడ్డ వారిని ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ఇచ్చోడ, ఆదిలాబాద్ సర్కారు దవాఖానలకు తరలించారు.
నిందితుల వివరాలు ..
ఇద్దరిని హత్య చేసినట్లు నిందితులు అబ్దుల్ రషీద్, షేక్ ఆస్లాం షేక్ అస్గర్, షేక్ షఫత్, షేక్ సద్దాం, షేక్ రబ్బన్, షేక్ జుమ్మా, షేక్ మూస, షేక్ హషం, షేక్ హామీద్, షేక్ అల్లాఉద్దీన్, షేక్ జలీల్ ఒప్పకున్నారని పేర్కొన్నారు. వీరిని బోథ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చినట్లు ఇన్చార్జి ఎస్పీ వివరించారు. మిగితా నిందితుల కోసం హైదరాబాద్, మహారాష్ట్ర, ఆదిలాబాద్ నుంచి ప్రత్యేక బృందాలను రప్పించి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిందితులు స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోవాలన్నారు. ప్రస్తుతం గుండాల గ్రామం పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉందన్నారు. 5 గురు సీఐల ఆధ్వర్యంలో 200 మంది బలగాలతో పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, ఆసిఫాబాద్ స్పెషల్ బ్రాంచ్ సీఐ కంప రవీందర్, స్థానిక రమేశ్ బాబు, నేరడిగొండ, గుడిహత్నూర్, సిరికొండ మండలాల ఎస్ఐలు సుమన్ భరత్, కృష్ణ కుమార్, ప్రవీణ్ కుమార్ సిబ్బంది ఉన్నారు.