
ఆసిఫాబాద్ అంబేద్కర్‌చౌక్, అక్టోబర్ 29 : జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్లు భాగస్వాములవ్వాలని కుమ్రం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వొడెపల్లి గార్డెన్స్‌లో అన్ని బ్యాంకుల ఆధ్వర్యంలో నిర్వహించిన రుణ వితరణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో ఎక్కువగా రైతులు ఒకే పంటపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. పంట రుణం లక్ష్యాన్ని 90 శాతం ఖరీఫ్‌లో చేరుకోవాలని నిర్దేశించినప్పటికీ ఆ దిశగా బ్యాంకర్లు ప్రయత్నాలు చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో బ్యాంకర్లు తమ విధానాలను మార్చుకోవాలని సూచించారు. జిల్లాలో రుణం తీసుకున్న వారు తిరిగి చెల్లించడంలో ఇబ్బందికి గురి చేస్తే తాము బ్యాంకర్లకు అండగా ఉంటామని తెలిపారు. సిర్పూర్లో అనేక మంది దగ్గరి నుంచి రుణం చెల్లింపులో సహకారం అందించామని తెలిపారు. జిల్లాలో గిరిజనుల సంఖ్య ఎక్కువగా ఉన్నారని వారికి వివిధ రకాల రుణాలు అందించి ఆర్థికాభివృద్ధికి సహకరించాలని కోరారు.
జిల్లాలో 40వేల మంది రుణాలు తీసుకునేవారు ఉన్నప్పటికీ 2వేల మంది రైతులకు మాత్రమే రుణాలు అందించారని తెలిపారు. ఇప్పటికైనా బ్యాంకర్లు లక్ష్యం మేరకు పని చేయాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో ఇరిగేషన్ అభివృద్ధి కోసం విద్యుత్ సరఫరా కూడా చేశామని, బోర్వెల్ వేసేందుకు రైతులు రుణం కోసం వస్తే తిరస్కరించవద్దన్నారు. జిల్లాలో వెయ్యి లీటర్ల సామర్థ్యంతో ఆసిఫాబాద్ , వాంకిడి , రెబ్బెన, కాగజ్‌నగర్‌లో పాల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైబ్రిడ్ గేదెలు కొనేందుకు రుణాలివ్వాలని, వచ్చే నెల 16 నుంచి 31వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహిస్తున్న హ్యాండ్ క్రాఫ్ట్ మార్కెట్ మేళాలో ఆసిఫాబాద్ నుంచి పాల్గొనే డ్వాక్రా సంఘాల సభ్యులకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. పుట్ట గొడుగులు, వెదురు, తదితర పరిశ్రమలకు రుణాలివ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ హన్మంత్‌రావు, ఎస్బీఐ నిజామాబాద్ డీజీఎం కుమార్, శ్రీనివాస్, అజయ్‌కుమార్ పాన్నారు.