మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 29: అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వెంకటేశ్‌నేతకాని అన్నారు. రూ. 10 లక్షల పట్టణ ప్రగతి నిధులతో మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో నిర్మించిన వస్తు విక్రయ కేంద్రాలను ( హ్యాకర్జోన్) బుధవారం సాయంత్రం పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే దివాకర్‌రావు, కలెక్టర్ భారతీ హోళికేరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా అద్భుతమైన సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని కొనియాడారు. పట్టణాల మౌలిక వసతుల కోసం ప్రతినెలా నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేసి అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. పార్కులు, ఓపెన్‌జిమ్‌లు, ఇంటింటికీ తాగునీరు, సిమెంట్ రోడ్లు, విద్యుత్ దీపాలు, సుందరీకరణ పనులు చేపడుతున్నారని తెలిపారు. రోడ్ల పక్కన ఇబ్బంది పడుతున్న వీధి వ్యాపారుల కోసం హ్యాకర్ జోన్లను ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. ఈ ప్రాంతంలోనే వ్యాపారాలు నిర్వహించాలని సూచించారు.
మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి
దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకువచ్చిన మహనీయులు మహాత్మాగాంధీ, జవహర్లాల్నెహ్రూలను ఆదర్శంగా తీసుకోవాలని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వెంకటేశ్ నేతకాని, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాలలోని గాంధీపార్కులో రూ. 15 లక్షల మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులతో ఏర్పాటు చేయించిన గాంధీ, నెహ్రూల కాంస్య విగ్రహాలను కలెక్టర్ భారతీ హోళికేరితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీపార్కులో మహనీయుల కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేసి దేశభక్తిని చాటడం ఆనందంగా ఉందని తెలిపారు. గాంధీ పార్కు అభివృద్ధికోసం అవసరమైనన్ని నిధులను కేటాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్‌చైర్మన్ ముకేశ్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వసుంధర, టీఆర్ఎస్ నాయకురాలు అత్తిసరోజ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి, కార్యదర్శి రాకేశ్, మహిళా అధ్యక్షురాలు గరిగంటి సరోజ, యూత్ అధ్యక్షుడు బింగి ప్రవీణ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సు ధీర్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, తదితరులున్నారు.
అండర్‌బ్రిడ్జి నిర్మాణ పనుల పరిశీలన
మంచిర్యాల పట్టణంలోని ముఖరాం చౌరస్తానుంచి హమాలీవాడ వైపు నూతనంగా నిర్మిస్తున రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే దివాకర్‌రావు, కలెక్టర్ భారతీహోళికేరి పరిశీలించారు. పనుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రైల్వే పట్టాలకు అవతలి వైపున ఉన్న హమాలీవాడ, అశోక్‌రోడ్, గోపాల్‌వాడ, తిలక్‌నగర్, దొరగారిపల్లె, గాంధీనగర్, రాజీవ్‌నగర్, తదితర ప్రాంతాలకు రవా ణా సౌకర్యం మెరుగుపడుతుందని నాయకులు తెలిపారు.