జిల్లా స్థితి గతులు తెలుసుకునేందుకే పర్యటన
నీతి ఆయోగ్ కమిటీ సభ్యుడు అనురాగ్
కెరమెరి, సెప్టెంబర్ 29: అభివృద్ధిలో వెనుకంజలో ఉన్న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, జిల్లా స్థితిగతులను తెలుసుకునేందుకే ఈ పర్యటన ఉద్దేశమని నీతి ఆయోగ్ కమిటీ సభ్యుడు అనురాగ్‌శర్మ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రగతి పనులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా ధనోర గ్రామంలో సాగు చేస్తున్న కేంద్రే బాలాజీ యాపిల్ తోటను సందర్శించారు. అడవి జంతువుల నుంచి పంటల రక్షణకు కంచెలను అందించాలని అధికారులను రైతు కేంద్రే బాలాజీ కోరాడు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అనంతరం సావర్‌ఖేడ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందిన హెచ్ఎం రంగయ్యను అభినందించారు. జోడేఘాట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.25కోట్ల నిర్మించిన భీమ్ స్మృతివనం, కుమ్రం భీమ్ మ్యూజియాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని వెనుకబడిన 114 జిల్లాలను గుర్తించామని, అందులో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఉం దని పేర్కొన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు, మౌలిక సదుపాయాలపై క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాలు సరిగా అమలవుతున్నాయా..? లేదా ? అని పరిశీలిస్తున్నామని తెలిపారు. రైతులకు అడవి జంతువుల బెడద తీవ్రంగా ఉందని దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఉద్యానవన శాఖ అధికారి రాథోడ్ శ్యాంరావ్, డీఈవో అశోక్, ఉద్యానవన డివిజన్ అధికారి నదీమ్, సావర్‌ఖేడ సర్పంచ్ తులసీరాం తదితరులున్నారు.
ఆసిఫాబాద్‌లో..
ఆసిఫాబాద్ అంబేద్కర్‌చౌక్ సెప్టెంబర్ 29 : జిల్లా కేంద్రంలోని శిశు మందిర్ పాఠశాలలో గల అటల్ ల్యాబ్‌ను కేంద్ర నీతి ఆయోగ్ కమిటీ సభ్యుడు అనురాగ్ శర్మ బుధవారం సం దర్శించారు. దేశం మొత్తంలో 8 వేల అటల్ ల్యాబ్‌లు ఉన్నాయని అందులో గిరిజన ప్రాంతమైన ఆసిఫాబాద్ శిశు మందిర్ పాఠశాలలో నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు తయరుచేసిన ఆటోమెటిక్ డస్ట్‌బిన్, డ్రైవర్‌లెస్ కార్, సెన్సార్ బైండ్ స్టిక్, ఆటోమెటిక్ స్ట్రీట్ లైట్ వివిధ రకాల ఆవిష్కరణలను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో అశోక్, జిల్లా సైన్స్ అధికారి కటుకం మధూకర్, డిప్యూటీ డీఈవో ఉదయ్‌బాబు, పాఠశాల కమిటీ అధ్యక్షుడు సతీశ్ బాబు, కార్యదర్శులు శ్రీనివాస్, వేణుగోపాల్, హెచ్ఎం గుండేటి కోటేశ్వరరావు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు బొట్టుపెల్లి సిద్ధార్థ, వాసుదేవ్, శైలేశ్ తదితరులు ఉన్నారు