
ముంపు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల పర్యటన
ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి యంత్రాంగం
పంట నష్టం అంచనా వేస్తున్న వ్యవసాయశాఖ సిబ్బంది
నిర్మల్‌లో మంత్రి అల్లోల పరిశీలన, అధికారులతో సమీక్ష
ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల క్షేత్రస్థాయి సందర్శన
రైతులు, బాధితులకు భరోసా
ఆదిలాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గులాబ్ తుఫాన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. పలు కాలనీల్లోకి వరద చేరగా, పంటలు నీట మునిగాయి. దీంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే రంగంలోకి దిగారు. నష్టం వివరాలను ఆయా శాఖల సిబ్బంది సేకరిస్తున్నారు. నిర్మల్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం పర్యటించి, పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ కూడా ఇప్పటికే పర్యటించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జోగు రామన్న, రేఖానాయక్ క్షేత్రస్థాయిలో పంట పొలాలను సందర్శించారు. రైతులు, బాధితులకు భరోసానిచ్చారు.
గులాబీ తుఫాన్ ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ప్రభావం చూపింది. రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో పలు కాలనీలు, పంట పొలాల్లోకి నీరు చేరింది. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. నిర్మల్ జిల్లాలో నష్టం వివరాలను రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం ఆరా తీశారు. కలెక్టర్ ముషారఫ్ అలీతో పాటు ఇతర అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిర్మల్ పట్టణంలోని పలు ముంపు కాలనీలను మంత్రి అల్లోల పరిశీలించారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ కూడా మంగళవారం పలు కాలనీల్లో పర్యటించి, బాధితులకు భరోసానిచ్చారు. ఇదే జిల్లాలోని పెంబి మండలం పెంబి, మందపల్లి, ఇటిక్యాల, తాటిగూడ గ్రామాల్లో ముంపునకు గురైన పంటలను ఎమ్మెల్యే రేఖానాయక్ పరిశీలించారు. ఆదిలాబాద్ రూరల్ మండంల మామిడిగూడలో ఎమ్మెల్యే జోగు రామన్న పర్యటించి పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని ఆయా గ్రామాల్లో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు బాధిత రైతుల క్షేత్రాలను సందర్శించారు. నష్టం వివరాలను సిద్ధం చేస్తున్నారు.
పంటలపై ప్రభావం
ఆదిలాబాద్ జిల్లాల్లో 4,11,586 ఎకరాల్లో పత్తి 70,096 ఎకరాల్లో సోయాబీన్, నిర్మల్ జిల్లాలో 1,61,377 ఎకరాల్లో పత్తి, 81,801 ఎకరాల్లో సోయాబీన్, మంచిర్యాల జిల్లాలో 1,60,410 ఎకరాల్లో పత్తి, 3500 ఎకరాల్లో సోయాబీన్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 2,95,299 ఎకరాల్లో పత్తి, 32 వేల ఎకరాల్లో సోయాబీన్ పంటలను రైతులు సాగు చేశారు. సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు అనుకూలిస్తుండడంతో వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు పంటలసాగుకు అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. ప్రభుత్వం ఎరువులను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, దుకాణాల్లో అందుబాటులో ఉంచి రైతులకు అవసరాల మేరకు పంపిణీ చేసింది. దీంతో రైతులకు వానకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయి. సీజన్ అనుకూలించడంతో పంట దిగుబడులు బాగా వస్తాయని ఆశించిన రైతులకు గులాబ్ తుఫాన్‌తో నిరాశే ఎదురైంది.
చేతికొచ్చే సమయంలో..
ప్రస్తుతం సోయాబీన్ కోత దశలో ఉంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గత వారం కోతలు ప్రారంభం కావాల్సి ఉండగా వానలతో సాధ్యం కాలేదు. ఏపుగా ఎదిగిన పత్తి పంటకు కాయలు బాగా వచ్చి దూది బయటకు వస్తున్నది. రెండ్రోజులుగా పడిన వర్షాలతో పంటల్లో నీరు నిలిచింది. దీంతో సోయాబీన్ గింజ ఎదుగుదల కూడా నిలిచిపోతుంది. పత్తి పంటలో కాయలు రాలిపోవడం, నల్లపడుతున్నాయి. దీంతో దిగుబడులపై ప్రభావం పడనుంది. కాగా ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో 7 వేల ఎకరాల్లో సోయాబీన్, 3 వేల ఎకరాల్లో పత్తి, 1500 ఎకరాల్లో వరితో పాటు ఇతర పంటలకు నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో టమాట రైతు కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 200 ఎకరాల్లో నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 29: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఆరా తీశారు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, పంటల నష్టం వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుల ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో, వర్షపాతం వివరాలు అడిగారు. గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఎలాంటి ఆస్తినష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టర్ ముషారఫ్ అలీ పారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, అధికారులు పాల్గొన్నారు.