
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్ కలెక్టర్‌కు ఆదేశం
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
వాన్వట్, మామిడిగూడల్లో ఎమ్మెల్యే జోగు రామన్న పంటల పరిశీలన
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 29 : పట్టణంలోని ఇబ్రహీం చెరువు అక్రమ లే అవుట్లను తొలగించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీని ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం మంత్రి పర్యటించారు. భారీ వర్షాల కారణంగా ఇబ్రహీం చెరువు పూర్తిగా నిండుకోవడంతో అక్రమ లే అవుట్ల ద్వారా నీరు బయటకు పోలేని పరిస్థి తి నెలకొన్న విషయం తెలుసుకున్న ఆయన చెరువును పరిశీలించారు. చెరువు కబ్జాకు గురవడంతో అలుగు పూర్తిగా మూసుకుపోయిందని, నీటిని బయటకు తరలించేలా పునరుద్ధరణ ప నులు చేపట్టాలని అధికారులకు సూచించారు. అక్రమ లే అవుట్లను తొలగించాలని ఆదేశించారు. అనుమతి లేకుండా లే అవు ట్లు చేసి, ప్లాట్లు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొని ప్రజలు ఇ బ్బందులు పడవద్దని సూచించారు. రెండ్రోజులుగా కురిసిన భా రీ వర్షాలతో నీటమునిగిన దివ్యనగర్ కాలనీలోని 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను పరిశీలించారు. నీటిని బయటకు పంపి, పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
మున్సిపల్ కార్యాలయం సందర్శన..
నూతన మున్సిపల్ కార్యాలయాన్ని మంత్రి సందర్శించారు. పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేగంగా పూర్తిచేయాలని సూచించారు. మిషన్ భగీరథ, రోడ్డు విస్తరణ, సుందరీకరణ, అంబేద్కర్ భవన నిర్మాణ పనులు, వరదల వల్ల నష్టపోయిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్లు రవి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
రైతులను ఆదుకుంటాం..
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 29 : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని వాన్వట్, మామిడిగూడల్లో వర్షాలతో నష్టపోయిన రైతుల పంటలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పత్తి, సోయాబీన్ పంటలకు తీవ్రనష్టం వాటిల్లిందన్నారు. పంటలు ప్రస్తుతం చేతికివచ్చాయని, వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేశారన్నారు. క్షేత్రస్థాయిలో నష్టాలను అంచనావేసి నివేదికలివ్వాలని సీఎం కేసీఆర్ తమను ఆదేశించారని చెప్పారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేలా ముఖ్యమంత్రితో చర్చించి, త్వరలోనే పరిహారం వచ్చేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ పుల్లయ్య, మండల వ్యవసాయాధికారి అష్రఫ్, నాయకులు సెవ్వ జగదీశ్, జిట్టా రమేశ్, రైతులు పాల్గొన్నారు.
పెంబి మండలంలో ఎమ్మెల్యే రేఖానాయక్..
పెంబి, సెప్టెంబర్ 29 : మండలంలోని పెంబి, మందపల్లి, ఇటిక్యాల, తాటిగూడ గ్రామాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పర్యటించి, ముంపునకు గురైన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నష్టపోయిన పంటల గురించి అసెంబ్లీలో చర్చించి, రైతులకు పరిహారం అందించేలా కృషిచేస్తానన్నారు. తహసీల్ కార్యాలయంలో 8మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఇటిక్యాల గ్రామంలో ఐదెకరాల్లో ఏర్పాటు చేస్తున్న బృహత్ ప్రకృతి వనం పనులకు భూమిపూజ చేశారు. అక్కడ పనిచేస్తున్న ఉపాధి కూలీలతో మాట్లాడారు. ప్రతి కుటుంబానికీ జాబ్‌కార్డు ఇప్పించాలని ఏపీవోకు సూచించారు.