
ఈ నిర్ణయంతో మారుమూల గ్రామాల గిరిజన విద్యార్థులకు సైతం మేలు
ఇప్పటికే పలు ఆశ్రమాల్లో ప్రవేశపెట్టిన ఐటీడీఏ
బెస్ట్ అవైలెబుల్ స్కీం ద్వారా ప్రైవేట్ విద్యాలయాల్లోనూ ఉచితంగా చదువులు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సర్కారు అన్ని ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం బోధించేందుకు సన్నద్ధమవుతున్నది. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసి కార్పొరేట్ స్థాయి విద్యనందించే లక్ష్యంతో ముందుకెళ్తున్నది. ఇక ఇప్పటికే ఐటీడీఏ అడవిబిడ్డలకోసం పలు ఆశ్రమాల్లో ‘ఇంగ్లిష్ మీడియం’ తీసుకువచ్చింది. మరోవైపు ‘బెస్ట్ అవైలేబుల్’ ద్వారా ప్రైవేట్ విద్యాలయాల్లోనూ ఉచితంగా వారికి విద్యనందిస్తున్నది. తాజాగా టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయంతో మారుమూల గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు సైతం ‘ఆంగ్ల విద్య’ అందుబాటులోకి రానుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
అన్ని సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కార్పొరేట్‌కు దీటుగా నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు కసరత్తు చేస్తున్నది. ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆకర్షణీయంగా పాఠశాలలను తీర్చిదిద్దుతున్నది. డిజిటల్ తరగతులు అందుబాటులోకి తేవడంతో పాటు విద్యుద్దీకరణ, ఫర్నిచర్, తాగునీరు.. తదితర సదుపాయాలు కల్పిస్తున్నది. గోడలపై ఆంగ్ల పదాలను రాయడంతో పాటు ఆకట్టుకునేలా జంతువులు, పక్షుల బొమ్మలు వేస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం పేద, మధ్య తరగతికి చెందిన వారి పిల్లలకు సైతం ఆంగ్ల మాధ్యమం అందుబాటులోనికి రానున్నది. మున్ముందు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగనుంది.
ఇప్పటికే ఐటీడీఏ ఆధ్వర్యంలో..
ఇప్పటికే ఐటీడీఏ ఆధ్వర్యంలో పలు ఆశ్రమ పాఠశాలల్లో ఆంగ్ల బోధనను ప్రయోగాత్మకంగా మొదలు పెట్టింది. ప్రతి మండలానికి రెండు మూడు ఆశ్రమాలను ఎంపిక చేసి ఆంగ్ల మాధ్యమంలో విద్యనందిస్తున్నది. ఇందుకోసం ఎంపిక చేయబడిన ఉపాధ్యాయులకు శిక్షణ సైతం ఇచ్చింది. ఎక్కువగా డిజిటల్ విధానంలో తరగతులు నిర్వహిస్తుండగా, ఇందుకోసం ప్రత్యేకంగా సదుపాయాలు కల్పించారు. ఎల్ఈడీ స్క్రీన్లు, ప్రొజెక్టర్లను అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు గిరిజన విద్యార్థులకు తేలికగా అర్థమయ్యేలా ప్రత్యేకంగా సీడీలను రూపొందించి విద్యాబోధన చేపడుతున్నారు. ప్రస్తుతం చాలా చోట్ల తరగతులు కొనసాగుతున్నాయి.
బెస్ట్ అవైలెబుల్
సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలేబుల్ స్కీంలో భాగంగా కార్పొరేట్ పాఠశాలలు, కాలేజీల్లో సైతం గిరిజన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యనందిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పేరొందిన ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను ఎంపిక చేసి ఐటీడీఏ ఖర్చుల ద్వారా పేద విద్యార్థులకు విద్యనందిస్తున్నారు. పది ప్రైవేట్ పాఠశాలల్లో సుమా రు 1500 మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆయా పాఠశాలల్లో యేటా 60 మందికి ఐటీడీఏ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నారు. తాజాగా రాష్ట్ర సర్కారు నిర్ణయంతో 1258 ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అందుబాటులోకి రానున్నది.
తాజా నిర్ణయంతో ప్రతి గిరిజన విద్యార్థికీ మేలు
మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సర్కారు అన్ని ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల బోధనకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నిర్ణయంతో మారుమూల గిరిజన విద్యార్థులకు సైతం ‘ఇంగ్లిష్ మీడియం’ అందుబాటులోకి రానుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
గిరిజన విద్య బలోపేతమవుతుంది
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన చేపట్టడం వల్ల గిరిజన విద్య బలోపేతమవుతుంది. ఆసిఫాబాద్ జిల్లాలో మారుమూల గిరిజన పల్లెలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు మీడియంలోనే విద్యాబోధన సాగుతోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ మీడియంతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వం తీసుకొస్తున్న ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా గిరిజన విద్యార్థులకు ఆంగ్ల విద్య అందుతుంది. మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయి. గిరిజన పిల్లల భవిష్యత్‌కు భరోసా వస్తుంది. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పెరుగుతున్న పోటీని తట్టుకునే విధంగా గిరిజన విద్యార్థులు సామర్థ్యాలను పెంచుకోగలుగుతారు. రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం గొప్పది.-కనక వెంకటేశ్వర్లు, టీటీఎఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి
గిరిజన సమాజం స్వాగతిస్తుంది
అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల గిరిజన విద్యార్థులకు సైతం మేలు జరుగుతుంది. అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న గిరిజనులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదించలేక పోతున్నారు. ఐటీడీఏ కొంత మంది గిరిజన విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో, కార్పొరేటు కాలేజీల్లో చదువులు చెప్పిస్తోంది. కొన్ని ఆశ్రమాల్లో ఇంగ్లిష్ విద్యాబోధన కూడా సాగుతోంది. తాజాగా రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయంతో మారుమూల ప్రాంతాల్లోని గిరిజన పిల్లలకు సైతం ఆంగ్ల విద్య అందుబాటులోకి వస్తుంది. పైసా ఖర్చులేకుండా గిరిజన పిల్లలు ఆంగ్లం చదువుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయాన్ని గిరిజన సమాజం స్వాగతిస్తుంది.
-మడావి రఘునాథ్, రాజ్‌గోండ్ సేవా సమితి అధ్యక్షుడు, కెరమెరి