
ఖానాపూర్ ఎఫ్‌డీవో కోటేశ్వర్రావు
ఖానాపూర్ టౌన్, జనవరి 29: నిర్మల్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్ యూరప్ పక్షులకు నిలయంగా మారిందని ఖానాపూర్ ఎఫ్‌డీవో కోటేశ్వర్రావు పేర్కొన్నారు. పట్టణంలోని అటవీశాఖ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. సైబీరియా దేశం నుంచి సుమారు 8 వేల కిలోమీటర్లు ప్రయాణించి దేశంలోని పలు రాష్ర్టాలకు పక్షులు వలస వచ్చినట్లు తెలిపారు. రెండు నెలల పాటు కవ్వాల్ టైగర్‌జోన్ ప్రాంతంలో విహరిస్తాయని చెప్పారు. యూరప్‌లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో నవంబర్ నుంచి జనవరి వరకు ఈ ప్రాంతానికి వలస వస్తున్నాయని వివరించారు. వీటిని గ్రీన్ వింగేడ్ టిల్ లేదా యూరేషియన్ టిల్ పక్షులని పిలుస్తారని పేర్కొన్నారు. సైబీరియా నుంచి 50 రకాల పక్షులు వలస వచ్చి ఈ చలికాలంలో కవ్వాల్ టైగర్ జోన్లో సేదతీరడానికి రావడం చాలా అద్భుతమని అన్నారు. ఇక్కడ చెరువులో ప్రశాంత వాతావరణం, నత్తలు, నాచు, పలు రకాల చిన్న చిన్న మొక్కలు, సులభంగా లభించే పోషకాహారం పుష్కలంగా ఉండడంతో ఇక్కడికి చేరుకుంటున్నాయని అన్నారు. వీటితో పాటు నార్త్ ఇండియా నుంచి కూడా చాలా జాతులకు చెందిన పక్షులు కవ్వాల్ టైగర్ జోన్‌లోని కలపకుంట గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వస్తున్నాయని, వాటిని వేటగాళ్ల బారిన పడకుండా సంరక్షించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించామని చెప్పారు.