అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
మంచిర్యాల అర్బన్, ఆగస్టు 28 : ఈ నెల 30 లోగా జిల్లాలోని చౌకధరల దుకాణాలు, ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలకు బియ్యం పంపిణీని పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లుతో కలిసి మంచిర్యాల మార్కెట్లోని ఎంఎల్ఎస్ పాయింట్‌ను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సకాలంలో అందజేయాలన్నారు. జిల్లా పౌరసరఫరాల మేనేజర్ గోపాల్, డీటీ వరదరాజు, ఎంఎల్ఎస్ పాయింట్ నిర్వాహకులు ఉన్నారు.
పాఠశాలను శుభ్రంగా ఉంచాలి
జైపూర్, ఆగస్టు 28: పాఠశాలలను శుభ్రంగా ఉంచాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలను పూర్తిగా శానిటైజేషన్ చేయాలన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. తహసీల్దార్ మోహన్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు ఆలేస్ మాధుర్య, పంచాయతీ కార్యదర్శి ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ స్థల పరిశీలన
సీసీసీ నస్పూర్, ఆగస్టు 28: ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటుకు సుందరయ్యకాలనీ సమీప వారసంత స్థలాన్ని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శనివారం పరిశీలించారు. రూ. 4 కోట్ల 50 లక్షలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మార్కెట్ ఏర్పాటుకు కనీసం రెండెకరాల స్థలం ఉండాలి. ఇక్కడ కూడా ఎకరం 30 గుంటల భూమి మాత్రమే ఉంది. మరో 10 గుంటలు అయితే మార్కెట్ నిర్మాణానికి అనుకూలంగా ఉండడంతో ఆయన పరిశీలించారు. ఇక్కడి వారసంతకు కేటాయించిన భూమి వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, తహసీల్దార్ జ్యోతి, మున్సిపల్ సిబ్బంది పెద్దింటి మోహన్‌రావు, తదితరులు ఉన్నారు.