
ఐటీడీఏ ఆధ్వర్యంలో రూ.6 కోట్లతో పథకం
ఇక్రిశాట్ సాయంతో అమలుకు చర్యలు
వ్యాధులు, ఇతర సమస్యలకు చెక్
ఉమ్మడి జిల్లాలో 12,111 మందికి లబ్ధి
ఆదిలాబాద్, ఆగస్టు 28 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో మహిళలు, చిన్నారులకు బలవర్ధక ఆహారం అందించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఐటీడీఏ ఆధ్వర్యంలో రూ. 6 కోట్లతో గిరిపోషణ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇక్రిశాట్ సహకారంతో అమలు చేయనున్న ఈ పథకం ద్వారా ఆదిమ గిరిజనుల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలకు పౌష్టకాహారం లభించనుంది. వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుండగా, 12,111 మందికి లబ్ధి చేకూరనుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనుల్లో పౌష్టికాహార లోపం వారిలో పలు సమస్యలకు దారితీస్తున్నది. పౌష్టికా హారలోపం కారణంగా గిరిజన ప్రాంతాల్లోని స్థానికుల్లో రక్తహీనత ఏర్పడుతున్నది. దీంతో వారు తరచూ అనారోగ్యం బారిన పడడమే కాకుండా ఇతర ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పీటీజీ గిరిజనుల్లో పౌష్టికాహారలోపం ఎక్కువగా ఉండగా ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ ఆధ్వర్యంలో రూ. 6 కోట్లతో గిరిపోషణ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. ఈ పథకం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 12,111 మందికి ప్రత్యేకంగా తయారు చేసిన పౌష్టికాహారం లభించనుంది. ఐటీడీఏ, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చేయనున్నారు. పీటీజీ పల్లెల్లో మూడు నుంచి ఆరేళ్ల పిల్లలతో పాటు గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆహారం అందజేస్తారు. పౌష్టికాహారం తయారీకి కావాల్సిన సరుకులను గిరిజన సహకార సంస్థ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఆహారం తయారీలో ఇక్రిశాట్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు.
రెండు పూటల పౌష్టికాహారం
గిరిపోషణ కార్యక్రమం అమల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని 12,111 మంది లబ్ధిదారులకు రెండు పూటల పౌష్టికాహరం లభించనుంది. అంగన్వాడీ కేంద్రాల్లో ఇక్రిశాట్ సహకారంతో తయారు చేసిన పోషకాలు, విటమిన్లు, ఐరన్ కలిగి ఉన్న ఆహార పదార్థాలను ఇస్తారు. ఆదిలాబాద్ జిల్లా లో పీటీజీ గ్రామాల్లో 5093 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుండగా మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు 2917 మంది, గర్భిణులు 546 మంది, కిశోర బాలికలు 1187 మంది ఉన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 5140 మంది లబ్ధిదారులు ఉండగా వీరిలో 2034 మంది 3నుంచి 6 సంవత్సరాల పిల్లలు, 486 మంది గర్భిణులు, 2160 మంది కిశోర బాలికలు ఉన్నారు. మంచిర్యాల జిల్లాలో 1566 మంది లబ్ధిదారులు ఉండగా 867 మంది మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు, 220 మంది గర్భిణులు, 342 మంది కిశోర బాలికలు ఉన్నారు. నిర్మల్ జిల్లాలో 312 మందికి ప్రయోజనం చేకూరనుండగా వీరిలో 212 మంది మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు, 37 మంది గర్భిణులు, 52 మంది కిశోర బాలికలు ఉన్నారు. ప్రభుత్వం పౌష్టకాహారం లోపం నివారణకు చేపట్టిన గిరిపోషణ పథకం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని లబ్ధిదారులు అంటున్నారు.