
జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్
గాదిగూడ మండలంలోని పాఠశాలలు తనిఖీ
నార్నూర్, ఆగస్టు 28: సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ ఉపాధ్యాయులు, పంచాయతీ సిబ్బందికి సూచించారు. గాదిగూడ మండలం అర్జుని, ఝరి, లోకారి, పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను శనివారం ఆయన తనిఖీ చేశారు. ప్రధానోపాధ్యాయులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని పరిసరాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం పరిశీలించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు సమన్వయంతో ప్రతి పాఠశాలలో మౌలిక వసతులతో పాటు పారిశుధ్య, శానిటేషన్ పనులు ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. కొవిడ్ నిబంధనలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఎంపీవో సాయిప్రసాద్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,పంచాయతీ కార్యదర్శులు రవి, సునీల్‌కుమార్, సర్పంచ్‌లు ఉన్నారు.
తాడిహత్నూర్లోని పాఠశాలల సందర్శన
నార్నూర్, ఆగస్టు 28: తాడిహత్నూర్లోని జిల్లా పరిషత్, ఆశ్రమోన్నత పాఠశాలను ఎంపీడీవో రమేశ్ సందర్శించారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదులను పర్యవేక్షించారు. పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలన్నారు. ఆయన వెంట ఈజీఎస్ ఏపీవో జాదవ్ శేషారావ్, పంచాయతీ సిబ్బంది, ఉపాధ్యాయులు ఉన్నారు.
విద్యార్థినులను గురుకులానికి పంపించాలి
బోథ్, ఆగస్టు 28: బోథ్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు విద్యార్థినులను పంపించాలని ప్రిన్సిపాల్ బీఎం సువర్ణలత కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల పరిసరాలను, నీటి ట్యాంకులను శుభ్రం చేయించారు. తరగతి గదులు, హాస్టల్ రూంలు శానిటేషన్ చేయించారు. భోజనశాలలో సరుకులు పరిశీలించారు. గురుకులంలో కొవిడ్ నిబంధనల ప్రకారం బోధన, వసతులు కల్పిస్తామన్నారు. తల్లిదండ్రులు భయపడకుండా తమ పిల్లలను గురుకులానికి పంపించాలని కోరారు. ప్రిన్సిపాల్ వెంట వైస్ ప్రిన్సిపాల్ రవికుమార్, ఉపాధ్యాయులు ఉన్నారు.
ఏర్పాట్లు పూర్తి చేయాలి
గాదిగూడ, ఆగస్టు 28: ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాసంస్థల పునఃప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని వైస్‌ఎంపీపీ ఎం యోగేశ్ పంచాయతీ సిబ్బంది, ఉపాధ్యాయులకు సూచించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల పరిసర ప్రాంతాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు శుభ్రం చేయాలని సూచించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సంబంధిత శాఖ అధికారుల సహకారంతో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. తరగతి గదుల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యాబోధన జరిగేలా, విద్యార్థులను పాఠశాలలకు పంపించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో రామేశ్వర్, ఎంఈవో ఆశన్న, ఎంపీవో సాయిప్రసాద్ ఉన్నారు.
పాఠశాలల్లో పారిశుధ్య పనులు
ఇంద్రవెల్లి, ఆగస్టు 28: మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో పంచాయతీ సిబ్బంది చెత్తను తొలగించారు. తరగతి గదుల్లో శానిటేషన్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కోరెంగా గాంధారి, ఈవో శ్రీనివాస్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు గోపాల్‌సింగ్ తిలావత్, మాజీ సర్పంచ్ కోరెంగా సుంకట్రావ్, గ్రామ పంచాయతీ సిబ్బందిలు ఇద్రిష్, నారాయణ, సంజయ్ పాల్గొన్నారు.
బేల, ఆగస్టు 28: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను పంచాయతీ సిబ్బంది శుభ్రం చేశారు. సర్పంచ్ వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి సురేశ్ , తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, ఆగస్టు 28: లక్కారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ జనార్దన్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది శానిటేషన్ చేసి పిచ్చిమొక్కలు తొలగించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు ఉన్నారు.