
ఆసిఫాబాద్ అంబేద్కర్‌చౌక్, జనవరి 28 : దళిత బంధు పథకానికి మొదటి విడుతలో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి మండలానికో గ్రామాన్ని ఎంపిక చేస్తామని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎస్పీ (అడ్మిన్) వైవీఎస్ సుధీంద్రతో కలిసి జిల్లా అధికారులు, నాయకులతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాటాడారు. జిల్లాలో 176 కేసులు ఉండగా 155 పరిష్కరించామని చెప్పారు. మిగతావి త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్నందున ప్రతి నెలాఖరు పని దినాల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. పోలీస్ శాఖకు కేసుల పూర్తి వివరాలు అందించాలని , పరిష్కారం కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. 2021లో ఆసిఫాబాద్ పరిధిలో 22 కేసులు రాగా, 13 పరిష్కరించిననట్లు తెలిపారు. కాగజ్‌నగర్ పరిధిలో 18 కేసులు రాగా 9 పరిష్కరించినట్లు వివరించారు. సివిల్ కేసుల పరిష్కారానికి చొరవచూపుతామని తెలిపారు. అట్రాసిటీ కేసులపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి తప్పుడు కేసులు నమోదు కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. దళితబంధులో ఒకే విధమైన యూనిట్ కాకుండా వేర్వేరుగా యూనిట్ల ఎంపిక ఉంటుందన్నారు. ఆ దిశగా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. దళితబంధుతో పాటు రైతు బీమా, రైతు బంధు మంజూరు కోసం దళారులు డబ్బులు తీసుకొని మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి జరుగకుండా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. దళిత బంధుకు పారదర్శకంగా నిధులు కేటాయించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు వి వరించారు. సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్ అన్నారు. ఆదిలాబాద్ నుంచి శుక్రవారం ఆసిఫాబాద్, మంచిర్యాల , నిర్మల్ , ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాలన్నీ శుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూర య్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు ఉన్నారు.